చంద్రగిరి నుంచే టీడీపీ పతనం | - | Sakshi
Sakshi News home page

చంద్రగిరి నుంచే టీడీపీ పతనం

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

● స్థానిక సమరానికి వైఎస్‌ఆర్‌సీపీ సమరశంఖం ● ఒక్క ఎన్నికా ఏకగ్రీవం కాకుండా ప్రతి చోటా బరిలోకి దిగాలి ● అభ్యర్థులను అండగా ఉంటాం : భూమన, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

చంద్రగిరి: చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ఆరంభం కావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క ఎన్నిక కూడా ఏకగ్రీవం కాకుండా ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రగిరిలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని ఆ విజయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. చంద్రగిరిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లిలోనే రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. కల్యాణీ రిజర్వాయర్‌లో నీరు లేక ఎండిపోతోందని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు.

ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు

స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకూడదన్న లక్ష్యంతో ప్రతి పంచాయతీలో అభ్యర్థులను బరిలోకి దించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అభ్యర్థులను గెలిపించే వరకు వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

సమన్వయ కమిటీలతో సమీక్షలు

ప్రతి పంచాయతీలో ఎన్నికలు ముగిసే వరకు తరచూ సమీక్షలు నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తుడా ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడపకూ చేర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబం చేసిన మంచి దేశంలో ఏ నియోజకవర్గంలో జరగలేదన్నారు. రాష్ట్ర వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మహిళలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement