క్లస్టర్‌ టీచర్ల పరిస్థితి అయోమయం | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ టీచర్ల పరిస్థితి అయోమయం

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

● ఒక్కోరోజు ఒక్కో పాఠశాలలో విధులు ● ఎవరైనా సెలవు పెడితే ఆ పాఠశాలలో విధి నిర్వహణ ● స్కూల్‌ అసిస్టెంట్‌ అయ్యుండి.. 1, 2 తరగతులకు బోధన

● ఒక్కోరోజు ఒక్కో పాఠశాలలో విధులు ● ఎవరైనా సెలవు పెడితే ఆ పాఠశాలలో విధి నిర్వహణ ● స్కూల్‌ అసిస్టెంట్‌ అయ్యుండి.. 1, 2 తరగతులకు బోధన

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా ఉన్న క్లస్టర్‌ టీచర్ల పరిస్థితి అయోమయంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం జిల్లా వ్యాప్తంగా 117 మందికిపైగా టీచర్లు మిగులుగా ఉన్నారు. వీరందరినీ క్లస్టర్‌ పాఠశాలలకు అనుసంధానించారు. క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయుల పరిధిలో ఉంటూ పని చేయాలని నిబంధన పెట్టి మొబైల్‌ టీచర్‌ విధానంలా క్లస్టర్‌ టీచర్‌ విధానాన్ని తీసుకొచ్చారు.

కష్టాలు ఎన్నో

క్లస్టర్‌ టీచర్‌ విధానంతో క్షేత్ర స్థాయిలో క్లస్టర్‌ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి క్లస్టర్‌ పరిధిలోని ఏదేని పాఠశాలలో టీచర్‌ సెలవు పెడితే ఆ పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలకు వెళ్లి బోధించాలి. విధులు లేకుంటే క్లస్టర్‌ పాఠశాలలోనే ఉండాల్సి వస్తోంది. కొన్నిమార్లు స్కూల్‌ అసిస్టెంట్లు అయ్యుండి 1, 2 తరగతులకు బోధించాల్సి రావడం బాధాకరమంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్‌ టీచర్ల విషయంలో ఏ క్లస్టర్‌ పాఠశాల నిర్ధిష్ట ప్రణాళిక పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్దుబాటు చేయాలి

ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 60 మందికిపైగా విద్యార్థులుంటే తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తున్నారు. ఇదే విధానాన్ని బేసిక్‌ ప్రాథమిక పాఠశాలల కు వర్తింపజేసి, అవసరమైనచోట క్లస్టర్‌ టీచర్లను సర్దు బాటు చేయాలని పలువురు టీచర్లు సూచిస్తున్నారు.

జిల్లా సమాచారం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,993

ప్రాథమికోన్నత పాఠశాలలు 12

ఉన్నత పాఠశాలలు 304

హైస్కూల్‌ ప్లస్‌లు 54

మొత్తం పాఠశాలల సంఖ్య 2,363

విద్యార్థుల సంఖ్య 1,47,050

క్లస్టర్‌ పాఠశాలల సంఖ్య 130

క్లస్టర్‌ టీచర్ల సంఖ్య 117

అప్పటికప్పుడు పాఠశాలకు పయనం

ఏ పాఠశాలకు వెళ్లాలన్న సమాచారం లేకపోవడంతో క్లస్టర్‌ టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. డెప్యుటేషన్‌ వేసినట్లుగా క్లస్టర్‌ పాఠశాలకు వెళ్లినప్పుడు పలాన పాఠశాలకు వెళ్లాలని చెబుతారని, అప్పటికప్పుడు హుటాహుటిన ఆ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఆ పాఠశాల వాతావరణం, విద్యార్థులతో మమేకమయ్యేందుకు క్లస్టర్‌ టీచర్లకు వీల్లేకుండా పోతోంది. దీంతో నాణ్యమైన బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement