ఒక్కో సచివాలయంలో ఒక్కో డీఏ మాత్రమే
మరమ్మతుల్లో పలు కంప్యూటర్లు
నెట్‌లేక ముప్పుతిప్పలు
వెంటాడుతున్న సర్వర్ సమస్యలు
అయోమయంలో అర్హులు
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలలు తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే అర్హుత ఉన్న పింఛన్‌దారులు దరఖాస్తు చేసుకోవడానికి నానా తిప్పులు పడుతున్నారు. ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడం.. మధ్యలో శని, ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో అర్హులైన వారు ఆందోళనలో మునిగిపోయారు.
ఇబ్బందులెన్నో?
ఒక్కో సచివాలయంలో పింఛన్ల దరఖాస్తు వ్యవహారాలను చూడడానికి ఒక్కో డిజిటల్ అసిస్టెంట్ (డీఏ)ను మాత్రమే అందుబాటులో ఉంచారు. పలు సచివాలయాల్లో డీఏలకు చెందిన కంప్యూటర్లు పనిచేయడంలేదు. దీంతో వారు మరొకరి కంప్యూటర్‌ను వినియోగించాల్సి వస్తోంది. అంతేకాకుండా పలు కంప్యూటర్లకు ఇచ్చిన నెట్ కనెక్షన్లు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో డీఏ తమ మొబైల్ ద్వారా నెట్‌కు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సర్వర్ సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో దరఖాస్తుకు సాధారణంగా 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే నెట్, సర్వర్ ఇబ్బందులతో 20 నిమిషాల వరకు తీసుకుంటోంది. గంటకు నాలుగు దరఖాస్తులు చేసినా ఆరు గంటలకు 24 లేదా 25 దరఖాస్తులు మాత్రమే చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 200 నుంచి 240 మందికిపైగా అర్హులు ఉన్నారు.
డప్పు కళాకారుల దరఖాస్తుల నిరాకరణ
ప్రతి గ్రామ, వార్డు పరిధిలో డప్పు కళాకారులు ఉన్నారు. సచివాలయంలో వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు. సచివాలయ ఉద్యోగులను వారు గట్టిగా ప్రశ్నిస్తే కలెక్టరేట్‌కు వెళ్లి ఐడీ కార్డులతోపాటు ఆర్డర్ కాపీలు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో గురువారం పలువురు డప్పు కళాకారులు కలెక్టరేట్‌కు వచ్చి తమ అర్జీలను ఇవ్వాల్సి వచ్చింది.
కొత్త పింఛన్ల దరఖాస్తులకు సవాలక్ష సమస్యలు
న్యాయం చేయండి
పింఛన్ దరఖాస్తు కోసం సచివాలయానికి వెళ్లాం. అయితే వారు సోషల్‌వెల్ఫేర్ అధికారి నుంచి అనుమతి తీసుకురావాలని సూచిస్తున్నారు. లేదంటే కలెక్టరేట్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చాం. వీళ్లు ఆర్డర్ ఎప్పుడు ఇస్తారా తెలియడం లేదు. టెన్షన్‌గా ఉంది. – మస్తానయ్య, శ్రీకాళహస్తి మండలం
దరఖాస్తు తీసుకోవడం లేదు
ఒంటరి మహిళకు 40 ఏళ్ల వయస్సు ఉంటే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు 50 ఏళ్లు ఉంటేనే ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ నిబంధన పెట్టారు. సచివాలయ ఉద్యోగులు దరఖాస్తును స్వీకరించ లేదు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చాం.
–వాణి, ఒంటరి మహిళ, శ్రీకాళహస్తి మండలం


