కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

● రౌడీయిజం చేస్తూ అనారోగ్యంతో కుప్పకూలిన టీడీపీ నేత మృతి ● ఆ నెపం సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలపైకి నెట్టి జైలుకు ● తీవ్రంగా మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పెళ్లకూరు: టీడీపీ నాయకులు చేసిన రౌడీయిజానికి వత్తాసు పలికిన పోలీసులు పెళ్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరోమారు నాన్‌బెయిల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో గురువారం నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. గ్రామంలోని సర్వే నంబరు 17లో ఉన్న సత్యనారాయణరెడ్డి భూములకు సంబంధించిన పంటకాలువ వద్ద బుధవారం సిమెంట్‌ పైపులు ఏర్పాటు చేసుకొని రోడ్డు నిర్మాణ పనులు చేయించుకుంటున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాకేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చైతన్యకృష్ణారెడ్డి తమ అనుచరులతో కలిసి సంబంధిత భూముల వద్దకు చేరుకుని అనవసర రాద్ధాంతం చేస్తూ రౌడీయిజానికి దిగారు. దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో వడ్డిపాళెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వలిపి బాలయ్య(55).. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని దుర్భాషలాడుతూ సంఘటనా స్థలానికి వెళుతూ సుమారు 50 మీటర్లు దూరంలో ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపడిపోయాడు. పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో పాటు ఘటనా స్థలంలోని వారంతా చూస్తుండగా కిందపడిపోయిన బాలయ్యను చికిత్సల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.

మరోమారు అక్రమ కేసులు

ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త బాలయ్య మృతికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు మాత్రం 103(1), ఆర్‌/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మద్దూరు భాస్కర్‌, మద్దూరు చందు, మద్దూరు శ్రీనివాసులు, మల్లి ధయాకర్‌, బండి శివకుమార్‌, బెల్లంకొండ రవిపై అక్రమ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ రెడ్డిని 14రోజులు రిమాండ్‌ విధించి నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. మిగిలిన వారిని పోలీసు కస్టడీలో ఉంచారు. అనారోగ్య సమస్యతో బాలయ్య మరణిస్తే ఈ నెపాన్ని టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలపై నెడుతూ అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 14న కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో కూటమి నాయకులు చేస్తున్న ఇసుక దోపిడిపై ప్రశ్నించినందుకు సత్యనారాయణరెడ్డితో పాటు రైతులతో కలిపి మొత్తం 26మందిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ఆటోలో జైలుకు వెళ్లేందుకు కామిరెడ్డి నిరాకరణ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రిమాండ్‌ నిమిత్తం నెల్లూరు సబ్‌ జైలుకు ఆటోలో తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధపడడంతో సత్యనారాయణరెడ్డి అభ్యంతరం చెప్పారు. నాయుడుపేట నుంచి నెల్లూరుకు ఆటో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సులో అయినా తీసుకెళ్లాలని స్థానిక ఎస్‌ఐ ఆదిలక్ష్మిని కోరారు. దీంతో ఏసీ వాహనాలు, లగ్జరీ వాహనాల్లో తీసుకెళ్లలేమని ఎస్‌ఐ ఆదిలక్ష్మి రుసరుసలాడారు. కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా ఫొటోలు ఎందుకు తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసు జీపులో సత్యనారాయణరెడ్డిని నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement