వేడి సాంబార్‌ పడి ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేడి సాంబార్‌ పడి ఒకరికి గాయాలు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–2లో ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ ఒలికిపడి పడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్‌.హరీశ్‌కుమార్‌ గాయపడ్డారు. అన్నప్రసాదం పంపిణీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది, భక్తులు హరీశ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

‘రెవెన్యూ’కు సంజాయిషీ నోటీసులు

సైదాపురం: మండలంలో రీసర్వే నత్తనడకన సాగుతుండడంతో సంబధిత రెవెన్యూ అధికారులకు నెల్లూరు ఆర్డీఓ అనూష గురువారం సంజాయిషీ నోటీసులను జారీచేశారు. రీ సర్వే ప్రక్రియలో 10(1) నోటీసులో ఉన్న వివరాలనే డీఎల్‌ఆర్‌ ఎంట్రీలకు కాపీ చేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించకుండానే కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు జారీ చేశారు. సైదాపురం తహసీల్దార్‌ కార్యాలయ అధికారులకు నోటీసులు అందాయి. క్షేత్ర స్థాయిలో అధికారులు రీసర్వే పనుల్లో తీవ్ర జాప్యం చేయడంతో నాలుగో విడత రీసర్వే గ్రామాలైన పాతాళపల్లి, మిట్టపల్లి, నల్లబొట్లపల్లి, ఓరుపల్లి, కేజీఆర్‌పాళెం డీఎల్‌ఆర్‌లోనే ఉండిపోయాయి. అలాగే మొలకలపూడి, పొక్కందల, ఈదలకండ్రిగ, తోచాం, కృష్ణారెడ్డిపల్లి గ్రామాల్లో జరిగిన సర్వే వీఆర్వో, వీఎస్‌ లాగిన్‌లోనే ఉండడంతో ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలిసింది.

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం

తిరుపతి సిటీ: హైదరాబాద్‌ వేదికగా ఈనెల 5వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగిన ఆల్‌ ఇండియా కరాటే చాంపియన్‌షిప్‌లో తిరుపతి విశ్వసాయి జూనియర్‌ కళాశాల విద్యార్థి టీ.జశ్వంత్‌రెడ్డి గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌ కృష్ణమోహన్‌, డైరెక్టర్‌ శివసంకేత్‌ మాట్లాడుతూ తిరుపతి బ్రాంచ్‌కు చెందిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి జశ్వంత్‌రెడ్డి జాతీయ స్థాయి కరాటే పోటీలలో రెండు ఈవెంట్లలోనూ గోల్డ్‌మెడల్స్‌ సాధించండం కళాశాలకు గర్వకారణమన్నారు. తమ కళాశాలలో అకడమిక్‌ విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గోల్డ్‌మెడల్‌ సాధించిన విద్యార్థిని ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందించారు.

ముక్కంటి సేవలో

శ్రియా చరణ్‌

శ్రీకాళహస్తి రూరల్‌: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ప్రముఖ సినీనటి శ్రియా చరణ్‌ దర్శించుకున్నారు. దక్షిణగోపురం వద్ద ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యురాలు కోలా వైశాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement