తిరుపతి సిటీ: ‘కష్టం నీ ఆయుధమైతే... విజయం నీ బానిసవుతుంది’ అనే సామెతను ఈ విద్యార్థులు వంద శాతం రుజువు చేశారు. డాక్టర్ కావాలనే కోరికను నెరవేర్చుకున్నారు. ఇంటర్మీడియెట్ అనంతరం నీట్ లక్ష్య ఛేదన వైపు గురిపెట్టారు. కొందరు కోచింగ్ సైతం తీసుకోకుండానే నీట్‌కు సన్నద్ధమై సక్సెస్ సాధించారు. తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చారు. నీట్ యూజీ పరీక్షల్లో ఆల్ ఇండియా కోటాలో ఉత్తమ ర్యాంకులు సాధించి తాము ఆశించిన వైద్య కళాశాలల్లో సీట్లు సాధించి ప్రవేశాలు పొందారు.
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు
ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి సీట్లు సాధించిన విద్యార్థులకు గత రెండు రోజుల నుంచి పద్మావతి, ఎస్వీ వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కళాశాలలకు విచ్చేసి ప్రవేశాల ప్రక్రియను పూర్తిచేశారు. ఈ ఏడాది మేలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన తమను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ పిల్లలు ఏ స్థాయిలో బాధ పడలేదని, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరింత శ్రద్ధతో రీ నీట్‌కు సన్నద్ధమయ్యారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పలు ఆవరోధాలు ఎదురైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించడం గర్వంగా ఉందన్నారు.
నూతన విద్యార్థులకు అభినందన
ఎస్వీ వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటాలో 36 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా.. ఇందులో గురువారం నాటికి 23 మంది ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా రిపోర్ట్ చేశారు. నలుగురు విద్యార్థులు స్వయంగా కళాశాలకు విచ్చేసి అడ్మిషన్లు పొందారు. నూతనంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు, వైస్ ప్రిన్సిపల్ (అడ్మిన్) డాక్టర్ వెంకటేశ్వర్లు, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి అభినందించారు.


