నాగలాపురం: భూముల రీ–సర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం పిచ్చాటూరు మండలంలోని కీలపూడి గ్రామంలో పర్యటించారు. రీ–సర్వే, రైతులు ఈకేవైసీ, ఓటర్ల జాబితా సవరణ, ఖనిజ రవాణా తదితర అంశాలను పరిశీలించారు. కీలపూడి వద్ద ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న టిప్పరు వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నాగార్జునతో కలిసి ప్రస్తుతం పొలాల్లో జరుగుతున్న రీ–సర్వే పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు వివరాలు, పంట దిగుబడి, సాగునీటి వసతుల గురించి ఆరాతీశారు. అనంతరం కీలపూడి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సర్ ప్రకియలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. పిచ్చాటూరు తహసీల్దార్ చంద్రబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నేపాల్‌లో తిరుపతి యాత్రికులు సేఫ్
తిరుపతి అర్బన్: నేపాల్ దేశంలో ఆకస్మిక వరద కారణంగా అనేక మంది బలయ్యారు. అయితే తిరుపతికి చెందిన సుమారు 28 మంది యాత్రికులు సేఫ్‌గా ఉన్నట్లు ఏపీ భవన్ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. వీరంతా నేపాల్ రాజధాని ఖాట్మాండులో సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
విచారణకు 80 శాతం మంది హాజరు
తిరుపతి అర్బన్: సర్ ప్రక్రియలో భాగంలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ కాని వారికి నోటీసులు జారీ చేసిన క్రమంలో ఇప్పటి వరకు 80 శాతం మంది ఓటర్లు విచారణకు హాజరైనట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఽఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్‌కుమార్ శర్మ గురువారం ఎన్టీఆర్ జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ నోటీసులు అందుకున్న వారిలో 20శాతం మంది మాత్రమే హాజరుకాలేదని చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెప్టెంబర్ 21వ తేదీకి విచారణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.


