– కొత్త విధానంపై డీలర్ల నిరసన
తిరుపతి అర్బన్: శిక్షణ ఇవ్వకుండా కొత్త విధానాలను అమలు చేయడం సరికాదంటూ రేషన్ డీలర్లు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి చౌకదుకాణాల్లో కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లారీలో నుంచి బియ్యం బస్తాలు దించుకునే సమయంలో మొబైల్ ద్వారా ప్రతి బస్తాను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేయాలని, ఆ తర్వాత కార్డుదారులకు బియ్యం ఇచ్చే సమయంలో మళ్లీ మొబైల్ ద్వారా ప్రతి బస్తాను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేయాలంటూ కొత్త నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. ఏ మాత్రం శిక్షణ ఇవ్వకుండా కొత్త రూల్స్‌ను అమలు చేయడాన్ని తప్పుపట్టారు. కేజికీ రూ.1 మాత్రమే కమీషన్ ఇస్తున్నారని, దాన్ని రూ.3కు పెంచాలని డిమాండ్ చేశారు.
విశేష స్పందన
తిరుపతి కల్చరల్: జన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం వివిధ పాఠశాలల్లో నిర్వహించి చెకుముకి సైన్స్ ట్యాలెంట్ టెస్ట్‌కు విశేష స్పందన లభించిందని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సుకంర రెడ్డెప్ప తెలిపారు. సైన్స్ సంబరాల్లో భాగంగా మండల, పట్టణ, జిల్లా స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన టెస్ట్‌కు తిరుపతి నగరంలో సుమారు 4,700 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. త్వరలో రాష్ట స్థాయిలో పరీక్ష నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 77,568 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,033 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.19 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


