కక్షగట్టి.. కేసు పెట్టి! | - | Sakshi
Sakshi News home page

కక్షగట్టి.. కేసు పెట్టి!

Aug 13 2026 1:45 AM | Updated on Aug 13 2026 1:45 AM

వాసుయాదవ్‌పై అక్రమ కేసులు

సమగ్ర విచారణ చేయాల్సిందే

న్యాయం చేయాలంటూ

వాసుయాదవ్‌ తల్లి ఆందోళన

కూటమి అరాచకాలపై

భగ్గుమన్న యాదవులు

తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాదవుల అణిచివేతకు కుట్రలు చేస్తున్నారని, రాజకీయ కక్షలతో తన కుమారుడిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారని వాసుయాదవ్‌ తల్లి యచ్చం రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి నగరంలోని యాదవులతో కలిసి డీబీఆర్‌ ఆస్పత్రి మార్గంలోని బీపీ మండల్‌ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ తిరుపతి ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌ రాజకీయ కక్షతో వాసుయాదవ్‌ను హత్యాయత్నం కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా కాణిపాకంలో ప్రమాణం చేశాడని, మీరు అక్రమ కేసులు బనాయించలేదని ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. అక్రమ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, జేబీ శ్రీనివాస్‌ ఇంటి వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. యాదవ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు జేబీ శ్రీనివాస్‌కు ఎవరిచ్చారని మండిపడ్డారు. వాసుయాదవ్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షులు బత్తల గీతాయాదవ్‌ మాట్లాడుతూ తిరుపతిలో ఎంతో మంది రాజకీయాలు చేశారు కానీ, జేబీ శ్రీనివాస్‌లా నీచరాజకీయాలు ఎవరూ చేయలేదన్నారు. పవిత్ర పుణ్యక్షేతంలో గూండాయిజం చెలాయించే జేబీ శ్రీనివాస్‌కు టీడీపీ ఇన్‌చార్జి పదవిని చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. జేబీ శ్రీనివాస్‌ అనుచిత వ్యాఖ్యలపై యాదవులంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. యాదవులకు వైఎస్సార్‌సీపీ అత్యున్నత స్థానాలను కల్పించిందని, టీడీపీ యాదవులను కించపరుస్తోందని మండిపడ్డారు. అనంతరం యాదవ సంఘం నేత తులసీయాదవ్‌ మాట్లాడుతూ తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జి పదవిని జేబీ శ్రీనివాస్‌కు ఇచ్చినప్పటి నుంచి భూ కబ్జాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. వాసుయాదవ్‌ ఎలాంటి దాడి చేయకపోయినా హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవ సంఘం నేతలు ఉమా అజయ్‌, పెరుగు బాబుయాదవ్‌, మోహన్‌కృష్ణ యాదవ్‌, ఈతమాకుల సురేష్‌, బత్తల అరుణయాదవ్‌, తండ్ల మోహన్‌యాదవ్‌, ఈతమాకుల గుణ, శరత్‌యాదవ్‌, కృష్ణాయాదవ్‌, సద్దా బాబూ పాల్గొన్నారు.

యాదవుల అణిచివేతకు కుట్రలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement