తిరుపతి మంగళం : ప్రపంచ సంక్షేమం కోరుతూ టీటీడీ నిర్వహించే వైదిక కార్యక్రమాలు, యాగాలకు పాలకవర్గం, అధికారులు తిలోదకాలు వదిలేశారని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో మీడియాతోమాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తాయని, రాష్ట్రంలో కరువు తాండవిస్తోందన్నారు. రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురవనప్పుడు వరుణయాగం చేయడం టీటీడీలో వస్తున్న ఆనవాయితీ అని వెల్లడించారు. వైదిక సంస్కృతిలో యజ్ఞ యాగాలకు పెద్దపీట వేసే సంస్కృతిని టీటీడీ పాలకవర్గం, అధికారులు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్ల కాలంగా టీటీడీలో అలాంటి కార్యక్రమాలు ఏవీ జరపకుండా చంద్రబాబు, కూటమి నేతలకు ఊడిగం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తుందని ఆరోపించారు. చివరకు తిరుమలలోని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని చిన్న చిన్న ప్రాజెక్టులు సైతం చుక్క నీరులేక ఎండిపోయితున్నాయని సష్టం చేశారు. సాగు నీరు లేక రైతులు, తాగడానికి గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చేయాల్సిన వరుణయాగాన్ని టీటీడీ పూర్తిగా విస్మరించిందన్నారు. రెండున్నరేళ్లగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టిందని, దీంతేఓ వైదిక కార్యక్రమాలకు బదులు అవినీతి, అరాచకం, అపచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా దేశ సుభిక్షం కోసం అనేక యజ్ఞయాగాలు చేయించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని వెంటనే వరుణయాగం చేయించాలని డిమాండ్ చేశారు.


