తిరుపతి తుడా : జూనియర్ డాక్టర్లు తమ స్టయిఫండ్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం మెరుపు సమ్మెకు దిగారు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఆందోళనకు చేపట్టారు. జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా వైద్య విద్యార్థులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ఓపీ సేవలను, అకడమిక్ తరగతులను బహిష్కరించి జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. ఎస్వీ మెడికల్ కళాశాల ప్రాంగణం నుంచి, ప్రసూతి ఆస్పత్రి, చిన్నపిల్లల విభాగం మీదుగా రుయా ఆస్పత్రి వరకు ర్యాలీ కొనసాగింది. బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేశారు. శ్రమకు తగిన గౌరవ వేతనం ఇవ్వాలని, తక్షణం తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పూర్తిస్థాయిలో వైద్య సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే దశలవారీగా ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.
ఓపీ సేవలకు అంతరాయం
జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె కారణంగా రుయాలో ఓపీకి అంతరాయం ఏర్పడింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వైద్య సేవలను కొనసాగించారు. జూనియర్ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులకు వైద్యం అందడంలో ఆలస్యమైంది.


