తిరుపతి అర్బన్ : తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని నారా లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని ఏఐఎస్‌ఎఫ్ నేతలు నిలదీశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర, జిల్లా నేతలు గజ్జుల వలరాజు, ప్రవీణ్‌కుమార్, చిన్నా, బండి చలపతి మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలని, జీవో–77ను రద్దు చేయాలని డి మాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన భోజనం కల్పించలేదని విమర్శించారు.
అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
తిరుచానూరు ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఏఐఎస్‌ఎఫ్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. విద్యార్థి సంఘం నేతలు హరికృష్ణ, వినయ్, రవి, అశోక్, సురేష్, తారక్ పాల్గొన్నారు.


