శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని కొట్టు మండపంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రధాన హుండీతోపాటు పరివార దేవతల వద్ద హుండీలను సైతం లెక్కించారు. ఈ మేరకు 22 రోజులకు గాను మొత్తం రూ.1,63,69,899 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే 35.100 గ్రా ముల బంగారం, 539 కిలోల వెండి, 157 నోట్ల విదేశీ కరెన్సీ వచ్చాయని వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు, సభ్యుడు గుర్రప్పశెట్టి పాల్గొన్నారు.
సీఎస్‌ఆర్ కింద పోలీసులకు ‘ఈవీ’లు
తిరుపతి క్రైమ్ : పోలీసు శాఖకు హీరో మోటోకార్ప్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద 66 ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను అందించింది. బుధవారం ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు చేతుల మీదుగా మహిళా పోలీసులకు వాహనాలను పంపిణీ చేశారు. ఇందులో 53 ద్విచక్రవాహనాలను జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లకు, మిగిలిన 13 వెహికల్స్‌ను మహిళా పోలీసు విభాగాలకు కేటాయించారు. ప్రధానంగా శక్తి బృందాల ద్వారా మహిళల భద్రత, అత్యవసర ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్, డయల్–112 సేవలపై ప్రచారం కోసం వీటిని వినియోగించనున్నారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణహిత విద్యుత్ వాహనాల వినియోగంతో ఇంధన వ్యయం తగ్గడంతో పాటు ప్రజలకు మరింత వేగవంతమైన పోలీసు సేవలు అందే అవకాశముంటుందని తెలిపారు. అనంతరం విద్యుత్ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
20 నుంచి ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై అవగాహన
తిరుపతి సిటీ : ఎస్వీయూ రూసా 2.0 సహకారంతో సీఓఈ వీఎల్‌పీ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ టు బిల్డ్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. 25వరకు ఆరు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీకళాశాలలకు చెందిన అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్లు, అతిథి అధ్యాపకులు, పరిశ్రమల ప్రతినిధులు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఉచితమని, ఇతర వివరాలకు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ హేమను 9963499697 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
అక్రమ తవ్వకాలను సహించం
తిరుపతి అర్బన్ : ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను సహించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. మైనింగ్ అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. అధికారులు సమన్వయంతో దాడులు చేపట్టాలన్నారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీనాయక్, ఆర్‌డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు.
20లోపు ఏఈఈ పోస్టులకు దరఖాస్తులు
తిరుపతి రూరల్: ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ సంస్థల్లో ఏఈఈ పోస్టులకు ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ బుధవారం తెలిపారు. ఆగస్ట్ 22 నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారు.
వేగంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
తిరుపతి రూరల్ : స్మార్ట్ మీటర్ల వేగంగా ఏర్పాటు చేయాలని సీఎండీ శివశంకర్ ఆదేశించారు. బుధవారం ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 10.50 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చామన్నారు. డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్య, సీజీఎంలు ఆదిశేషయ్య, రమణాదేవి, రామచంద్ర రావు, సంపత్ కుమార్, రమణ, జీఎంలు శ్రీనివాసులు, జగదీష్, లత పాల్గొన్నారు.


