చిన్నపాటి కారణాలకే పోతున్న ప్రాణాలు
నగరంలో రాజ్యమేలుతున్న కత్తులు
ఆందోళనకరంగా శాంతిభద్రతలు
ఈ నెల 9న ఓటేరు ప్రాంతంలో జరిగిన మరో హత్య నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు మాల దాసరి శ్రీనివాసులును బైక్ అడిగారు. అపరిచితులు కావడంతో ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన నిందితులు బీరుసీసాలు, సిమెంట్ ఇటుకలతో తలపై మోది హత్య చేశారు.
తిరుపతి క్రైమ్ : దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరం తిరుపతి.. ఇప్పుడు వరుస హత్యలతో కలవరపడుతోంది. ఇటీవల జరిగిన వరుస హత్యలు ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలకు కారణమవుతున్నాయి. శుభకార్యాల వేదికలపై ప్రత్యర్థులను నరికి చంపడం, బైక్ ఇవ్వలేదని ప్రాణాలు తీయడం, నగల కోసం వృద్ధురాలిని కిరాతకంగా హతమార్చడం వంటి ఘటనలు శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పాత కక్షలు, కుటుంబ కలహాలు, క్షణికావేశం, మద్యం మత్తు, దోపిడీలే ఈ హత్యలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
‘పెద్దరికమే’ ప్రాణాలు తీసింది
ఈ నెల 8వ తేదీన తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జీవకోనకు చెందిన మునిరత్నం (41), క్యాబ్ డ్రైవర్ మణికంఠ (35)ను కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఏర్పేడు మండలం జంగాలపల్లెకి చెందిన సునీల్ తన భార్యను కారణం లేకుండా వదిలేయడంపై మునిరత్నం, మణికంఠ పెద్దలుగా ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన సునీల్ తన బంధువులతో కలిసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి వందలాది ముందే నిలువనా ప్రాణాలు తీసేశాడు. ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేపట్టిన తిరుపతి ఈస్ట్ పోలీసులు ప్రధాన నిందితులు సునీల్, వాసుదేవయ్య, ఉపేంద్రను అరెస్టు చేశారు.
ఆధ్యాత్మిక క్షేత్రంలో వరుస హత్యలు
తిరుపతిలో పెరుగుతున్న నేరాలు
శాంతిభద్రతలపై ఆందోళన
తిరుపతిలో వరుస హత్యలు ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కట్టుదిట్టంగా నిఘా, నైట్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణతోపాటు అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. నేర నియంత్రణకు పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
వృద్ధురాలిపై అమానుషం
జయానగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న 65 ఏళ్ల జ్యోతి ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు దోపిడీ కోసం అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మెడలోని బంగారు గొలుసు, చెవిపోగులు దోచుకోవడమే కాకుండా, చేతి ఉంగరం తీయలేక వేలిని నరికి తీసుకెళ్లారు. డబ్బు కోసం ఎంతటి క్రూరత్వానికై నా పాల్పడుతున్నారనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేసింది.


