ఏర్పేడు: ఏర్పేడు–వెంకటగిరి మార్గంలో నాగంపల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఏర్పేడు ఎస్‌ఐ రవిప్రకాష్ కథనం మేరకు.. ఏర్పేడు మండలం ఆమందూరు బీసీ కాలనీకి చెందిన గురుస్వామి, ప్రమీల దంపతుల కుమారుడు చెంచు గురుచంద్ర(28) రాక్‌మెన్ కంపెనీలో జూనియర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పాగాలి సమీపంలోని రాక్‌మెన్ కంపెనీకి వెళ్లేందుకు బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరాడు. నాగంపల్లి సమీపంలోని ఓ ఆస్పత్రి ఎదురుగా ముందు వెళుతున్న కట్టెల లోడ్ ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడుపుతూ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న చెంచు గురుచంద్ర తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


