ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

Mar 20 2026 9:15 AM | Updated on Mar 20 2026 9:15 AM

నాయుడుపేటటౌన్‌: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండడాన్ని గురువారం ఆర్టీసీ కంట్రోలర్‌ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ రామమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చని, చొక్క లేకుండా గళ్ల లూంగీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాం పక్కనే ఖాళీ మద్యం బాటిల్‌ పడి ఉండడంతో మద్యం సేవించి నీళ్ల దాహంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్టు

తిరుమల : టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని తిరుమల పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్‌ అనే వ్యక్తి టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని, దర్శన టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం యోగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత పాపులారిటీ కోసం యోగేష్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోందని, టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తిరుమలకు రానీయకుండా కూడా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాముడు హెచ్చరించారు.

ముక్కంటి సేవలో కేంద్రమంత్రి

శ్రీకాళహస్తి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా గురువారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి: పట్టణలలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు 108 వాహనం ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చూరీకి తరలించారు. ఇతని గురించి తెలిసిన వారు శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులను సంప్రదించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement