తిరుపతి ఇన్‌చార్జ్, టౌన్ అధ్యక్ష పదవి, మేయరా?
పోటీ పడితే ఏదో ఒకటి దక్కుతుందని టీడీపీ నేతల్లో ఆశ
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని రెండేళ్లుగా అంటీ ముట్టనట్టుగా మాజీ
కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా
అసంతృప్తిగానే సుగుణమ్మ
మరో సారి ప్రయత్నం.. అవే పదవుల కోసం లైన్‌లో మరో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో టీడీపీ రాజకీయం రంజుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నియోజక వర్గ ఇన్‌చార్జ్, నగర అధ్యక్ష పదవులు భర్తీ చేయలేదు. ఈ పదవులను దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వైపు మేయర్ పీఠం కోసం కూడా టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరం అత్యంత కీలకమైనది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి కేంద్రంగా కీలక పదవి చేతిలో ఉంటే.. జిల్లాలో చక్రం తిప్పొచ్చనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పార్టీ ఇన్‌చార్జ్, టౌన్ అధ్యక్ష, మేయర్ పదవుల కోసం పావులు కదుపుతున్నారు. మాజీ ఎమెల్యే సుగుణమ్మ, జేబీ శ్రీనివాసులు, మబ్బు దేవనారాయణరెడ్డి, శ్రీధర్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గత ఎన్నికల సమయంలో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటి నుంచి ఆమె తీవ్ర అసంతృప్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు ఇటీవల గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి ఇచ్చినా సుగుణమ్మ సంతృప్తిగా లేరు. మరో వైపు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆ పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అధిష్టానం సుగుణమ్మను తీవ్రంగా అవమానించిందని ఆమె వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టునట్టు వ్యవహరిస్తుండటంతో టీడీపీ శ్రేణులు కూడా ఆమైపె అసంతృప్తితో పట్టించుకోవడం మానేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఇన్‌చార్జ్ లేదా టౌన్ అధ్యక్ష పదవి కావాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పదవులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మేయర్ అభ్యర్థిగా అయినా ప్రకటిస్తారని, అదే జరిగితే ఆమె మనుమరాలు కీర్తిని కార్పొరేటర్‌గా బరిలోకి దింపి నగరపాలక పీఠంపై కూర్చొబెట్టవచ్చనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ అయితే అధికారం అంతా తమ చేతుల్లోనే ఉంటుందనే అభిప్రాయంతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఆమెను పదవి నుంచి తొలగించండి
మేమేం తక్కువా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వం కోసం మబ్బు దేవనారాయణరెడ్డి, జేబీ శ్రీనివాసులు పోటీపడ్డారు. అయినా వారికి కూడా భంగపాటు తప్పలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని మబ్బు దేవనారాయణరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో నియోజక వర్గ ఇన్‌చార్జ్ పదవి ఇస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందనే ఉద్దేశంతో మబ్బు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే జేబీ శ్రీనివాసులు కూడా నియోజక వర్గ ఇన్‌చార్జ్ పదవి లేదా టౌన్ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. వీరిలో సీఎం చంద్రబాబు ఒకరికి, మంత్రి లోకేష్ బాబు మరొకరికి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో ఖాళీగా ఉన్న పదవులు.. మరో పక్క త్వరలో ఖాళీ కానున్న తిరుపతి మేయర్ పదవి కోసం నాయకులు నాకా..నీకా అని పోటీ పడుతున్నారు. నగరంలో ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్, నగర అధ్యక్ష పదవితోపాటు మేయర్ టికెట్ కోసం జరుగుతున్న పోరులో టీడీపీ మూడు ముక్కలైంది. ఎవరికి వారే తమకంటే తమకని పాకులాడుతున్నారు. మరి ఆ పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూద్దాం.
టీడీపీలో మూడు ముక్కలాట!
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గట్టిగా పనిచేయలేదని జనసేన, టీడీపీ శ్రేణులు కొంద రు సుగుణమ్మపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చినా, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా ఆమె పట్టించుకోవటం లేదని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని లేఖలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఆమెను ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించి వేరొకరికి కట్టబెట్టమని ఒత్తిడి తెస్తున్నట్లు అమరావతిలోని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


