ఇష్టం లేనట్టు! | - | Sakshi
Sakshi News home page

ఇష్టం లేనట్టు!

Mar 6 2026 8:04 AM | Updated on Mar 6 2026 8:04 AM

● అక్రమ మ్యుటేషన్‌ వ్యవహారం గప్‌ చుప్‌ ● గుట్టురట్టుకు అడ్డుపడుతున్నదెవరు

తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాలకు అడ్డాగా మారింది. కొత్త ఇల్లు కట్టినా.. అదనపు అంతస్తు వేసినా పన్ను వసూలు చేసే ఈ శాఖలో అవినీతి పెచ్చుమీరిపోయింది. పన్నులు విధించడం వరకే పరిమితం కావాల్సిన వీరి విధులు హద్దులు దాటి, యజమానుల పేర్లు మార్పు వరకు కొనసాగింది. అక్రమ మ్యుటేషన్ల వ్యవహారం బయటపడినా.. ఇందులో నిందితులను గుర్తించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిలో అర్థం ఏమిటో శ్రీనివాసా అని నగర ప్రజలు అంటున్నారు.

నిగ్గుతేల్చుతారా.. నీరుగార్చేస్తారా..!

గుట్టు రట్టు..

తిరుపతి తుడా: మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇటీవల వెలుగు చూసిన అక్రమ మ్యుటేషన్‌పై విచారణ మందకొడిగా సాగుతోంది. అక్రమాలు వెలుగు చూసిన వెంటనే అధికారులు నానా హంగామా సృష్టించారు. వెంటనే అక్రమార్కులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామనేలా ఆర్భాటం చేశారు. రోజులు గడుస్తున్నా అక్రమ మ్యూటేషన్‌ వ్యవహారం గప్‌చుప్‌గా మారింది. అక్రమార్కుల గుట్టు రట్టు చేయడం అధికారులకు ఇష్టం లేనట్టుగా వ్యవహరం సాగుతోంది. కార్పొరేషన్‌ రెవెన్యూ సెక్షన్‌లో తమకు సంబంధం లేకుండా ఇంత జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మ్యుటేషన్‌ దొంగలు ఎవరనేది నిగ్గుతేల్చుతారా..? లేదా ఇంతటితో ఈ వ్యవహారాన్ని నీరుకారుస్తారా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతోంది. మ్యుటేషన్‌ అక్రమాల వెనుక ఇంటి దొంగల హస్తం ఉండడంతోనే ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగానికి, సంబంధిత అధికారులకు అంతుచిక్కకుండా సాగిన ఈ ఇంటి పన్నుల మార్పు వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయి.

విచారణ ఇంకెన్ని రోజులు?

తిరుపతి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగిన అక్రమ మ్యూటేషన్‌పై విచారణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గత నెల 13వ తేదీన ఈ వ్యవహారంపై కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలానే అమరావతికి వెళ్లి సీడీఎంఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి దీనిపై విచారణ సాగుతూ...నే ఉంది. ఇంటి పన్ను మార్చుకున్న వివరాలు కార్పొరేషన్‌ అధికారుల వద్ద స్పష్టంగా ఉన్నాయి. ఈ వివరాలను ఇప్పటికే పోలీసులకు అందజేశారు. వాటి ఆధారంగా ఎవరి ద్వారా పన్ను మార్చుకున్నారని విచారిస్తే గంటల్లోనే అసలు దొంగలు ఎవరనేది బహిర్గత మవుతుంది. పన్ను మార్పు వెనక ఎవరెవరు ఉన్నారన్నది తేల్చవచ్చు. అలానే ఏ కంప్యూటర్ల ద్వారా అక్రమ మ్యుటేషన్‌ జరిగిందన్న ఐపీ ద్వారా కనుక్కోవచ్చు. వారం క్రితమే ఐపీ అడ్రస్లు గుర్తించామని అమరావతి నుంచి సీడీఎంఏ అధికారులు కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా ఇప్పటివరకు వాటి వివరాలను కార్పొరేషన్‌కు ఇవ్వకపోవడంలో అంతర్యం ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌లోని ఒకరిద్దరితోపాటు సీడీఎంఎలో పనిచేస్తున్న ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో విచారణ సాఫీగా సాగుతుందన్న అనుమానం వ్యక్తం అవుతుంది. ఇంటి దొంగలను కాపాడేందుకే ఈ వ్యవహారాన్ని రోజుల తరబడి నాన్చుతూ వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పన్ను మార్చుకున్న వ్యక్తిని లోతుగా విచారిస్తే అక్రమ మ్యుటేషన్‌ వెనుక ఎవరున్నాదన్నది తేటతెల్లమవుతుంది. ఆ దిశగా శాఖా పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికై నా దీనిపై అధికారులు శ్రద్ధ చూపి విచారణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement