తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు
పలమనేరు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి
నిద్ర మత్తు, అతివేగమే కారణమా?
నుజ్జు నుజ్జయిన కారు
పలమనేరు/ గంగవరం: బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన మోహన్‌దాస్(71), కుసుమ(61) భార్యాభర్తలు. నాగరాజరావు(68), జయంతి(61) వృద్ధ దంపతులు. కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు. నాగరాజరావుకు కుమార్తె పూజ(32) ఉన్నారు. ఆ కుటుంబంలో జరిగే శుభకార్యానికి ముందు తిరుమలకు వెళ్లాలని బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కారును మోహన్‌రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు. వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ కూర్చున్నారు. ముళబాగిళ్ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్ చేశారు. కారు పల మనేరు వద్ద బైపాస్‌లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళుతున్న ఖాళీ సిమెంట్ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లింది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. పక్కరూట్లో వెళ్లే వాహనాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీ ని ఆపాడు. అప్పటికే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వేగంగా కారు ఢీకొనడంతో నిమిషాల వ్యవధిలో అందులో ఉన్న వారందరూ మృతి చెందారు. డ్రైవర్ తల గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది.
జేసీబీతో కారును విడదీసి..
లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును పోలీసులు జేసీబీ సహాయంతో అతికష్టం మీద వెనక్కిలాగారు. అప్పటికే కారులోంచి నాగరాజరావు శవం కిందపడింది. మిగిలిన వారి మృతదేహాలను స్థానికుల సాయంతో కిందికి దింపారు. ఆపై అంబులెన్స్‌లలో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఓపెన్‌కాని ఎయిర్ బెలూన్లు
కారులో అందరూ సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్ బెలూన్లు ఓపెన్ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు సంబంధం లేకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకుని ఉంటే వెనుకనున్న ముగ్గురైనా ప్రాణాలతో భయటపడేవారేమో.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన కాసేపటికే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పొద్దున బాయ్ చెప్పి బయల్దేరిన వారు ఇలా అవుతారని అనుకోలేదే.. నెలకు రెండు దఫాలు శ్రీవారిని దర్శించే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్ష వేయడం ఏంటి..? అని కుసుమ, జయంతి అన్న రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. కారు పేరు కూడా సెవన్‌హిల్స్ అని పెట్టుకున్నామే.. ఆ వెంకన్నకు మాపై దయలేదా..? అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మృతుల్లో నాగరాజరావు గతంలో బాళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఇతని కుమార్తె పూజ సైతం మృతి చెందింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నాగరాజరావు కుమారుడు ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడని.. ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో కడసారి చూపుకై నా కొడుకు వస్తాడో లేదోనని కొందరు రోదించడం అందరినీ కలచి వేసింది.
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబీకులు


