నాయుడుపేట టౌన్: పట్టణంలోని చంద్రబాబు కాలనీలో ఇళ్ల సమీపంలో ముళ్ల పొదల్లో ఓ పసికందును పడవేసి ఉండడాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. కాలనీలోని సుజాత ఇంటి సమీపంలో ముళ్ల పొదల్లో తెల్లవారుజామున పసిపాప ఏడుస్తున్నట్లు శబ్దం రావడంతో ఆమె గ్రహించి, ఇంట్లో ఉన్న కుమారుడు ఎళ్లు చందు, కుమార్, స్థానికులు సుధాకరయ్య, నాగరాజు, చెంగయ్యతో కలిసి ముళ్ల పొదల వద్దకు వెళ్లి పరిశీలించారు. ముళ్ల పొదల్లో ఓ పసిపాప పడి రోదిస్తూ ఉండటాన్ని గుర్తించారు. ఆ పాపను తీసుకువచ్చి, సంరక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న కాలనీలోని ఆశా వర్కర్ ప్రవీణ పసిపాపను భరత్‌నగర్ సచివాలయానికి చెందిన ఏఎన్‌ఎం ప్రశాంతితో కలిసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న సీడీపీఓ ఉమామహేశ్వరి, అంగన్‌వాడీ కార్యకర్త నాగవళ్లి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మణెమ్మ హుటాహుటీనా పసిపాపను పట్టణంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లి, చికిత్సలు అందించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ అమర్‌నాథ్ పసిపాపకు వైద్యచికిత్సలు నిర్వహించి పాప ఆరోగ్యకరంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్యచికిత్సల అనంతరం తిరుపతి జిల్లా కేంద్రంలోని శిశుమందిర్‌కు తరలించడం జరుగుతుందన్నారు.


