తిరుపతి అర్బన్: ప్రధానమైన సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో రెవెన్యూ సమస్యలపై ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డీఆర్వో నరసింహులుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రీసర్వే, మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, 22ఏ, కోర్టు కేసులు తదితర అంశాల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ ప్రవేశపెట్టిందని, పరిష్కార దిశగా తహసీల్దార్లు కృషి చేయాలని తెలిపారు. నిషేధిత భూముల జాబితాలోని భూములకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రతిపాదనలు నెలలోపు పూర్తి చేయాలని తెలిపారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌కు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్, ఆర్టీఓలు రామ్మోహన్, దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


