రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తిరుపతి క్రైమ్: నగరంలోని గరుడ వారిధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన నాగరాజు, చంద్రకళ(40) వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అప్పలాయగుంటకు బయలుదేరారు. ఈ క్రమంలో గరుడవారధిపై ద్విచక్రవాహనంలో వెళుతుండగా శ్రీనివాసం సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రకళ తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త నాగరాజుకు తీవ్రమైన గాయాలు కావడంతో ప్రభుత్వ రుయా ఆస్పత్రిలో చిక్కిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో రేణిగుంట విద్యార్థినుల ప్రతిభ
రేణిగుంట: విజయవాడలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయిలో వృత్తి విద్యా నైపుణ్య పోటీల్లో రేణిగుంట విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పోటీల్లో 26 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు 10 ట్రేడ్లలో 260 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ పోటీల్లో ఆపెరల్ ట్రేడ్‌లో రేణిగుంట బాలికల ఉన్నత, ప్లస్‌టూ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న ఎస్.రషీద భాను, ఈ.ధరహాసిని, పదో తరగతి చదువుతున్న ఎం. భాగ్యశ్రీ ప్రతిభ కనబరిచి, ద్వితీయ స్థానంలో నిలిచారు. వారిని మంగళవారం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసులు, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్యామల, విద్యాశాఖ అధికారులు అభినందించారు.
చేనేత వస్త్ర ప్రదర్శనను వీక్షించిన కమిషనర్ రేఖారాణి
తిరుపతి కల్చరల్: డీపీఆర్ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత జౌళి శాఖ కమిషనర రేఖారాణి మంగళవారం వీక్షించారు. ఈ నెల 25న ప్రారంభమైన ఈ ప్రదర్శన జనవరి 7వ తేదీ వరకు ఉంటుంది. వస్త్ర ప్రదర్శనలోని స్టాళ్లు, వస్త్రాల నాణ్యత, మన్నికను కమిషనర్ ప్రశంసించారు.


