కులగణన తర్వాత దేశంలో మార్పులు
తిరుపతి కల్చరల్: దేశంలో కులగణన తర్వాత మార్పులు రానున్నాయని, తర్వాత వెనుకబడిన వర్గాల ప్రజలు కులగణన తర్వాత రాజ్యాధికారం సాధించబోతున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు కులగణన జరగకపోవడంతో సగం జనాభా పేదరికం, అమాకత్వంతో జీవిస్తున్నారని, గత ప్రభుత్వాల నిర్ణయాలతో నలిగిపోయారని వాపోయారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఫలితంగా దేశంలో సంస్కరణలు జరగడంతో అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గొప్ప స్థానం లభించనుందన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యతోనే సమాజంలో సమూల మార్పులు సాధ్యమనే అంశంతో గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లతో విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు సమాజానికి దిక్సూచిగా నిలిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు హైకోర్టుల్లో, ప్రైవేటు సెక్టార్‌లో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు లక్ష్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. 2,600 ఉప కులాలు ఉన్న బీసీల్లో కేవలం 40 కులాలు మాత్రమే పార్లమెంట్‌లో అడుగుపెట్టారంటే బీసీలు ఎలా అణిచివేతకు గురవుతున్నారో అర్థమవుతుందన్నారు. త్వరలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జల్లి మదుసూదన్, మల్లేష్, శశికుమార రాజశేఖర్, శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు.


