వెంకటాపురంలో ఉద్రిక్తత
శ్రీకాళహస్తి: మత్స్యశాఖాధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల చర్యలతో వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులందరూ కలిసి వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. బై దేవతమ్మ సొసైటీకి సంబంధించిన రికార్డుల తనిఖీ పేరుతో తమ వద్ద సెర్చ్ వారెంట్ ఉందని చెబుతూ, సొసైటీ మాజీ అధ్యక్షుడు చంగల్ రాయలు ఇంట్లోకి ప్రవేశించి పుస్తకాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని శ్రీఇంట్లోకి వెళ్లి వెతకడానికి ఎలా అనుమతి ఇస్తాం?శ్రీ అని అధికారులను అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ రామిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు చంగల్ రాయలు మత్స్యశాఖాధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మహిళలు అధిక సంఖ్యలో మోహరించడంతో పోలీసులు ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. అయినా అధికారులు సెర్చ్ వారెంట్ ఉందంటూ పదేపదే వాదిస్తూ, ఏదైనా జరిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బైదేవతమ్మ సొసైటీ నేతల ఆరోపణలు కోర్టులో ఉండగా ఈ దౌర్జన్యం ఏంది కోర్టులో వివాదం కొనసాగుతుండగానే అధికారులు పోలీసులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆ సొసైటీ మాజీ చైర్మన్ చంగల్ రాయులు, గ్రామ సర్పంచ్ రామిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం సొసైటీలో 23 మంది సభ్యులు మాత్రమే ఉండగా, అధికార పార్టీకి చెందిన 33 మందిని చేర్చితే సంఖ్యాబలం పెరిగి సొసైటీపై పట్టు సాధించవచ్చన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాపురం గ్రామానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కోపరేటివ్ సొసైటీ ఆడిటర్ సురేష్ బాబు, ఫిషరీస్ అధికారి రాజేష్ మాట్లాడుతూ బై దేవతమ్మ సొసైటీ ఎన్నిక చెల్లదని, సొసైటీ రద్దు చేసినందున ఆ రికార్డులు వెంటనే తమకు అప్పగించాలన్నారు.


