విద్యార్థుల ఆరోగ్యం, భవితలో నర్సుల పాత్ర కీలకం
శ్రీకాళహస్తి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ నిర్మాణంలో నర్సుల పాత్ర కీలకమని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఓఎస్‌డీ రామోహన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని తెలుగుగంగ కాలనీ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బాలికల విభాగంలో మంగళవారం నర్సులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు శిక్షణ తరగతులు పూర్తయ్యాయని, ఇది ఏడవ శిక్షణ కార్యక్రమమన్నారు. గురుకులాల విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే వారి భవిష్యత్తును నిర్మించుకోగలరని, ఆ దిశగా ఆరోగ్యంపై నర్సులు శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రెడ్డి రూపేష్ గౌడ్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నర్సులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. లలిత మాట్లాడారు. గిరిజన విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గురుకుల నర్సుల పాత్ర అమూల్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రెడ్డి, నాగేశ్వర్‌రావు, రాధాకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ రజని, టీచర్లు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, సత్యసాయి జిల్లాల్లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు పాల్గొన్నారు.


