ఇన్‌చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..
పోస్టింగ్ ఇచ్చినా విధుల్లో చేరని
అధికారులు
ఇన్‌చార్జిల చేతుల్లోనే కీలక పోస్టులు
ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే
పని ఒత్తిడితో నలిగిపోతున్న ఉద్యోగులు
మితిమీరిన రాజకీయ జోక్యం..ఏక పక్షంగా వ్యవహరించాలన్న ఒత్తిళ్లతో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. అధికారులు లేక ఆ పోస్టులన్నీ ఇన్‌చార్జిలకు అప్పగించడంతో పర్యవేక్షణ కొరవడి అభివృద్ధి కుంటుపడుతోంది. చంద్రగిరి నియోజవర్గంలోని ఆరు మండలాల్లో పలు పోస్టుల్లో ఇన్‌చార్జిల పాలనే కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరికి రెండు, మూడు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిళ్లతో సెలవులో వెళుతున్నారు. ఫలితంగా మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా మారింది.
తుమ్మలగుంటలో
మురుగు కాలువ పైకప్పు పనులు అర్ధంతరంగా ఆపివేయడంతో తుప్పుపడుతున్న కమ్మీ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మండల స్థాయిలో కీలకంగా పనిచేసి అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాల్సిన స్థానాలన్నీ ఇన్‌చార్జిల చేతుల్లోకి వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడే గప్‌చుప్ అన్నట్టుగా సాగుతున్నాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు పోటీలు పడుతుంటారు. ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో పోస్టింగ్‌లు వేయించుకోవాలి. అయితే ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గంలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా మారిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండడం, ఆ పోస్టులన్నీ ఇన్‌చార్జులతో నెట్టుకొస్తుండడంతో సకాలంలో పనులు జరగడం లేదని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉద్యోగుల బదిలీల్లో స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధితోపాటు వారి కుటుంబ సభ్యుల జోక్యంతో చాలా మంది మండల స్థాయి అధికారులు చంద్రగిరి నియోజకవర్గానికి రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అవినీతికి అలవాటుపడి అన్నింటికీ సిద్ధమైన కొందరు అధికారులు మాత్రం చంద్రగిరిలో పోస్టింగ్ వేసుకుని, రాజకీయాలు చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో పరిపాలనను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది అధికారులు ఇవేమీ తెలియకుండా విధుల్లో చేరి ఆ తరువాత అధికార పార్టీ నేతల నుంచి అధికంగా ఒత్తిళ్లు వస్తుండడంతో ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనని దీర్ఘ కాలిక సెలవులో వెళుతున్నట్టుగా సమాచారం.
ఇతర జిల్లాల నుంచి వచ్చినా..
చంద్రగిరి నియోజకవర్గంలో విధులు నిర్వహించడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేసిన అధికారులెవరూ మొగ్గు చూపకపోవడంతో పక్క జిల్లాల నుంచి బలవంతంగా పోస్టింగ్ ఇచ్చి, తీసుకువస్తున్నట్టు సమాచారం. అయితే అంత దూరం నుంచి ఇక్కడకు వచ్చిన అధికారులు తమకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉడతా భక్తిగా విధులు నిర్వహించి వెళుతున్నారే తప్ప, ప్రజలకు జవాబు దారీగా పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆరు మండలాల్లోనూ ఇన్‌చార్జిల పాలన
పాకాల మండల తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ స్థానానికి ఎవరూ రాక పోవడంతో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్‌సాయికి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా అవకాశం కల్పించారు. అలాగే సీఐగా పనిచేస్తున్న సుదర్శన్‌ప్రసాద్‌కు కూడా ఇన్‌చార్జిగానే అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అలాగే రామచంద్రాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్ స్థానం ఖాళీగా ఉండడంతో కుప్పంబాదూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధనశేఖర్‌కు ఏఈగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే అధికారం ఆయనకు పూర్తి స్థాయిలో లేనందున బిల్లు ఆలస్యమవుతున్నట్టు సమాచారం. అనుప్పల్లి, నెత్తకుప్పం వీఆర్వోలుగా ఇన్‌చార్జిలు పనిచేస్తున్నందున రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నగొట్టిగల్లు మండల గృహ నిర్మాణశాఖ ఏఈ పోస్టు ఖాళీగానే ఉండడంతో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అతనికి బిల్లులు పెట్టే అధికారం లేకపోవడంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు పడలేదని బాధితులు చెబుతున్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగానే ఉండడం, దేవరకొండ వీఆర్వో పోస్టు ఇన్‌చార్జులకు అప్పగించడంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడంలేదు. ఎర్రావారిపాళెం మండలంలో తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ స్థానానికి డిప్యూటీ తహసీల్దార్ వాసుదేవ కుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. చంద్రగిరి మండలంలో చంద్రగిరి –1, చంద్రగిరి–3, కల్‌రోడ్డుపల్లి, ముంగిలిపుట్టు, దోర్నకంబాల వీఆర్వోలుగా ఎవరూ రాకపోవడంతో ఆ స్థానాలకు ఇన్‌చార్జి వీఆర్వోలు సేవలు అందిస్తున్నారు. ఇలా వరుసగా ఇన్‌చార్జిల పాలన సాగుతుండడంతో సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతిపెద్ద మండలంలోనూ అదే పరిస్థితి
చంద్రగిరి నియోజకవర్గంలో 34 గ్రామ పంచాయతీలు కలిగిన అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్ మండలంలోని కీలక పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలన కొనసాగుతుండడంతో పరిపాలనపై పట్టు తప్పుతోందని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు నెలలుగా డిప్యూటీ ఎంపీడీఓకు ఇన్‌చార్జి ఇచ్చి, తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఆయనకే మరో పంచాయతీకి కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో మూడు ఉద్యోగాలు ఒక్కరే ఎలా చేస్తారని పలువురు ఎంపీటీసీ సభ్యులు మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నిస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అత్యధికంగా ఇన్‌చార్జిలతో పరిపాలన సాగిస్తున్నట్టు సమాచారం. మండల స్థాయిలో అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాల్సిన సీట్లు ఖాళీగా ఉండడం, ఆ సీట్లలోకి అర్హత లేని అధికారులను ఇన్‌చార్జిలుగా నియమిస్తుండడంతో వారికి అధికారం లేక అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు సైతం లేకపోవడంతో రెండు, మూడు పంచాయతీలకు ఒకరు ఇన్‌చార్జిగా పనిచేయాల్సి వస్తోంది. దీంతో పని ఒత్తిడి పెరిగి అనారోగ్యం పాలవుతున్నట్టు పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌చార్జిల పాలన ఇంకెంత కాలమని, ఇన్‌చార్జి ఎంపీడీఓ దయాసాగర్‌ను ప్రశ్నిస్తున్న ఎంపీపీ (ఫైల్)
మితిమీరిన రాజకీయ జోక్యం
ఇన్‌చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..
ఇన్‌చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..
ఇన్‌చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..
ఇన్‌చార్జిల పాలన ఎక్కడెక్కడంటే..


