నేటి నుంచి రైలు టికెట్ల ధర పెంపు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: భారతీయ రైల్వేశాఖ సవరించిన ప్రయాణికుల టికెట్ ధరలను శుక్రవారం నుంచి అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చులను సమతుల్యం చేస్తూనే, మరిన్ని సేవలను విస్తరించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు తిరుపతి రైల్వే అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం లోకల్, స్వల్ప దూర ప్రయాణాలకు ఎలాంటి ధరల పెంపు లేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్లలోపు దూరానికి పాత ధరలే కొనసాగుతాయి. అయితే 215 కిలోమీటర్లకు మించిన ఆర్డినరీ క్లాస్ ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున ధర పెంచారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్–ఏసీ, ఏసీ క్లాస్లకు కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున అదనపు ఛార్జీలు విధించారు. ఉదాహరణకు నాన్–ఏసీ రైలులో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గత ధరలతో పోలిస్తే ఈ పెంపు చాలా స్వల్పమైనది. గతంలో ఆర్డినరీ క్లాస్‌లో కిలోమీటర్‌కు సగటున 30 నుంచి 50 పైసల ధర ఉండగా, ఇప్పుడు ఒక పైసా మాత్రమే అదనం. మెయిల్, ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీలో గత రేటు కిలోమీటర్‌కు సుమారు 50నుంచి 60 పైసలుండగా, 2 పైసల పెంపుతో మొత్తం ధర స్వల్పంగా పెరగనుంది. ఏసీ క్లాస్‌లో కూడా ఇదే విధానం అమలవుతుంది. ఈ సవరణలు ముందుగా జూన్ 2025లో ప్రకటించిన ఫేర్ రేషనలైజేషన్‌కు అనుబంధంగా ఉండనుంది. అప్పటి నుంచి ధరలు స్థిరంగా ఉన్నాయి.
మిశ్రమ స్పందన
ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ధరల పెంపును అర్థం చేసుకుంటూ సేవల మెరుగుదలకు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికే పెరిగిన ఇంధన ఖర్చుల మధ్య ఈ పెంపు అనవసరమని వాదన వినిపిస్తున్నారు.
దూర ప్రయాణికులపై పడనున్న భారం
ప్రజలపై పడే భారం స్వల్పమైనదే అయినప్పటికీ, ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు, రెగ్యులర్ ట్రావెలర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సగటున 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరాని రూ.10నుంచి రూ.20 అదనం పడనుంది.
అధికారికంగా ఉత్తర్వులు రాలేదు..
కాగా తిరుపతికి రోజుకు సుమారు 100 రైళ్లు వివిధ రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్ రైళ్లు 60, వీక్లీ రైళ్లు 20, ప్యాసింజర్ రైళ్లు 20 ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనార్థం రోజు దాదాపు 50 వేల మంది వరకు ప్రయాణికులు వస్తుంటారు. అయితే ఇప్పటివరకు రైలు టికెట్ ధరల పెంపు సవరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తమకు రాలేదని తిరుపతి రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. తాము కూడా పత్రికల్లో వచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు.


