తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దేశవ్యాప్తంగా గురువారం సెలవు దినం, వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల కొండంతా భక్తులతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి నుంచే భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. అలిపిరి మెట్టు మార్గాల్లో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక క్యూ శిలాతోరణం వరకు ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌డీ టైం స్లాట్ దర్శనాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. తలనీలాలు సమర్పించుకునే భక్తులతో కళ్యాణకట్టలు కిక్కిరిసిపోయాయి. అన్నప్రసాద భవనాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి నిరంతరంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. భద్రతా పరంగా అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్‌వే విధానాన్ని అమలు చేస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు, హోటళ్లు, వసతి గృహాలు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు ముందస్తు బుకింగ్ లేకుండా రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులు సహనం పాటిస్తూ, టీటీడీ సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేస్తోంది.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


