కాలేజీ స్థలం కబ్జా
సాక్షి టాస్క్ పోర్స్ : ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ప్రభుత్వ కళాశాల నేడు ఆక్రమణకు గురవుతున్నా కనీసం పట్టించుకునే వారే కరువయ్యారు. కళాశాల సిబ్బంది బాధ్యతగా కళాశాలను కాపాడుకోవాలనే సంకల్పంతో ఆక్రమణదారులను అడ్డుకుని స్థలాన్ని కాపాడాలని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. ఈ సంఘటన గూడూరు రెండవ పట్టణంలోని గాంధీగనర్ ప్రాంతంలోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఎస్‌కేఆర్ కళాశాలకు 1950 ప్రాంతంలోనే సుమారు 80 ఎకరాల భూములు కేటాయించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రావడంతో చిన్న, పెద్ద నాయకులు తమకు తోచిన విధంగా భూములు ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవేటు వ్యక్తులు కొంత స్థలం ఆక్రమించుకుని పక్కా భవనాలు నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది ప్రజాప్రతినిధి పేరు చెప్పి సుమారు 150 అంకణాల స్థలాన్ని కబ్జా చేసి కంచె వేసి కట్టడాలు నిర్మించేందుకు పూనుకున్నారు. దీనిని ఆసరా చేసుకుని మరొకరు మరో 200 అంకణాల స్థలం కబ్జా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా ఎవరికి వారుగా కళాశాల స్థలం ఆక్రమించుకుంటూ పోతున్నారు. కళాశాల స్థలం ఆక్రమణలపై కళాశాల ప్రిన్సిపల్ సింహాద్రిని వివరణ కోరగా ఇందిరానగర్ ప్రాంతంలో ఆక్రమణ జరుగుతుందని తెలిసి అడ్డుకున్నట్లు తెలిపారు. అయితే అప్పటికే వారు హద్దురాళ్లు ఏర్పాటు చేసి ఉన్నందున రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి కళాశాల స్థలం సర్వే చేసి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులను పంపి పరిశీలించడం జరుగుతుందని తెలిపారని ప్రిన్సిపల్ చెప్పారు.


