తిరుపతి–షిర్డీ ప్రత్యేక రైలు పొడిగింపు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మహారాష్ట్రలోని మరో పుణ్యక్షేత్రం షిర్డీ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం పండుగల సీజన్ దృష్ట్యా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి షిర్డీ సాయినగర్‌కు ప్రతి ఆదివారం నడుపుతున్న ప్రత్యేక రైలును ఈనెల 30 నుంచి డిసెంబర్ 28 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాయినగర్ షిర్డీ నుంచి తిరుపతికి ప్రతి సోమవారం నడుపుతున్న ప్రత్యేక రైలును డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 29 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మరో ఐదు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లను ఇప్పటికే అమల్లో ఉన్న ఛార్జీలతో పాటు ఆన్ లైన్ అడ్వాన్సుడ్ బుకింగ్స్ కూడా అమల్లో ఉంటాయని తెలిపారు. మరోవైపు చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రతీ బుధవారం, గురువారం నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు దిగువ మెట్టలో అదనపు హాల్ట్ ఇస్తూ రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి నుంచి తిరుపతికి బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు దిగువమెట్టలో తెల్లవారు జామున 4.30 గంటలకు ఆగనుంది. అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రతి గురువారం నడుపుతున్న ప్రత్యేక రైలు దిగువమెట్టలో రాత్రి 11.30 గంటలకు ఆగనుంది. మరోవైపు చర్లపల్లి నుంచి కొల్లాంకు సోమవారం నడుపుతున్న ప్రత్యేక రైలుకు కావలిలో రాత్రి 9.13 గంటలకు అదనపు హాల్ట్ ఇచ్చారు. కొల్లం నుంచి చర్లపల్లికి వచ్చే బుధవారం ప్రత్యేక రైలుకు కావలిలో అర్ధరాత్రి 12.33 గంటలకు హాల్ట్ ఇచ్చారు.


