ప్రీమియం కట్టుకోలేం
ఫసల్ బీమాపై అన్నదాతల
అయోమయం
ప్రీమియం చెల్లింపులపై లేని సమాచారం
ఆందోళనలో రైతాంగం
పంట బీమాకు ప్రీమియం కట్టుకునే ఆర్థిక స్తోమత మాకు లేదు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులతో పంట నష్టం జరిగితే అప్పులపాలైపోతాం. కాబట్టి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించాలి. గత ఖరీఫ్‌లో కూడా ప్రీమియం కట్టుకోలేక చాలా మంది రైతులు మిగిలిపోయారు. తుపాను కారణంగా నష్టం వచ్చినా పరిహారం అందక ఆవేదన చెందుతున్నారు. అన్నదాతల అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవాలి.
– పనబాక సుబ్బయ్య, రైతు, వాకాడు
ప్రభుత్వమే చెల్లించాలి
గత వైఎస్సార్‌సీపీ సర్కారు తరహాలోనే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి. గతంలో ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు కష్టమో తెలియడం లేదు. బీమా ప్రీమియం కట్టుకునే శక్తి చాలామంది రైతులకు లేదు. ఈకేవైసీ చేసుకోకపోవడంతో మాకు అన్నదా త సుఖీభవ కూడా అందలేదు. ప్రభుత్వమే ఈకేవైసీ చేయించి బీమా ప్రీమియం చెల్లించాలని కోరుతున్నాం. –మల్లికార్జున్‌రెడ్డి, రైతు, సత్యవేడు
●
తిరుపతి అర్బన్ : ఫసల్ బీమా పథకంపై చంద్రబాబు సర్కార్ మౌనం వీడడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే అధికారికంగా ఏ పంటకు రైతు ఎంత బీమా ప్రీమియం చెల్లించాలి అనే స్పష్టతను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే రబీ సీజన్ అక్టోబర్ 20 నుంచి మొదలై. నెల గడిచినా, ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అధికారులు బీమా ప్రీమియం వివరాలను వెల్లడించలేదు. దీంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాధారణంగా ఖరీఫ్ , రబీ సీజన్ ప్రారంభానికి ముందే బీమా ప్రీమియం లెక్కలు స్పష్టం చేయాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో (వాతావరణ ఆధారిత బీమా, పంట దిగుబడి బీమా) బీమా ప్రీమియం మొత్తాన్ని రైతులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. అన్నదాతలపై భారం పడకుండా ప్రభుత్వమే రైతుల ప్రీమియం సొమ్ము చెల్లించేది. అలాగే ఈకేవైసీ సైతం వైఎస్సార్‌సీపీ సర్కారే పకడ్బందీగా పూర్తి చేయించేది. దీంతో రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. ఒకవేళ పంటలు దెబ్బతిన్నప్పటికీ సకాలంలో పరిహారం నగదు వారి ఖాతాలో జమయ్యేది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవి కావు. అయితే చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత పంటలకు సంబంధించి బీమా ప్రీమియం సొమ్మును అన్నదాతలే చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
వ్యవసాయంపై శీతకన్ను వేసిన చంద్రబాబు ప్రభుత్వం
అంతా అనుచితం
ఆరుగాలం కష్టించే రైతులకు ప్రభుత్వం చేదోడుగా నిలవాల్సిన అవసరముంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సహకారం అందించాల్సిన కనీస ధర్మం ప్రభుత్వంపై ఉంటుంది. ఈ క్రమంలోనే గత వైఎస్సార్‌సీపీ సర్కారు చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతుల ఆర్థికాభివృద్ధికి ఇతోదికంగా చేయూతనందించింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది. ప్రీమియం చెల్లింపుల సంగతి దేముడెరుగు.. కనీసం ఏ పంటకు ఎంత కట్టాలో కూడా సకాలంలో వెల్లడించడంలో కూడా వైఫల్యం చెందడంపై రైతులు మండిపడుతున్నారు.
ప్రీమియం కట్టుకోలేం
ప్రీమియం కట్టుకోలేం


