డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి కల్చరల్ : ఎస్వీ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సరం మూడో సెమిస్టర్ ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన మూడో సెమిస్టర్ ఫలితాలను పది రోజుల వ్యవధిలోనే అటానమస్ హోదాలో కళాశాల విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ మల్లికార్జున రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చలపతి, కామేశ్వర్‌రావును అభినందించారు.
హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్
తిరుపతి సిటీ : పదో తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించి సకాలంలో చేరుకునేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. దీంతో విద్యార్థులు ఆలస్యం లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌లో పరీక్షా కేంద్రం వివరాలతో పాటు రూట్ మ్యాప్ ఉంటుందని వివరించారు.
రేపటి నుంచి
‘రైతన్నా మీకోసం’
తిరుపతి అర్బన్ : జిల్లాలో సోమవారం నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు రైతన్నా మీకోసం పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ సిబ్బందితోపాటు వీఆర్, ఇంజినీరింగ్, విద్యుత్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతు, సహకారం సంఘం సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించాలని ఆదేశించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, సాంకేతిక సాగు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రపంచ మార్కెట్‌పై అవగాహన కల్పించాలని కోరారు.
పూర్వ విద్యార్థి దాతృత్వం
చంద్రగిరి : విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకుడిని చేసిన పాఠశాలకు బైరెడ్డి భాను ప్రకాష్ అనే పూర్వ విద్యార్థి తన వంతు చేయూతనందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. చంద్రగిరి మండలం దోర్నకంబాలకు చెందిన భాను ప్రకాస్ తాను చదువుకున్న పాఠశాలలో రూ.6లక్షలు వెచ్చించి రెండు అదనపు తరగతులు నిర్మించారు. అలాగే ఉత్తమ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందిచారు. శనివారం ఈ మేరకు ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి అదనపు తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం సహకరిస్తే మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉచితంగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంఈఓలు లలిత కుమారి, భాస్కర్ బాబు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,098 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,962 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
డిగ్రీ ఫలితాలు విడుదల
డిగ్రీ ఫలితాలు విడుదల


