● ఇసుక తవ్వేయడంతో భారీ గోతులు ● వరద పారుతున్నా యంత్రాలత
కూపుచంద్రపేట వద్ద బావిని తలపిస్తున్న ఓ గొయ్యి
తిరుపతి రూరల్: స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు తమ అక్రమ సంపాదన కోసం రాత్రి, పగలు తేడా లేకుండా భారీ యంత్రాలను నదిలోకి దించి 30 అడుగుల లోతుకు ఇసుక తవ్వి తరలించారు. ఏడాది పొడవునా ఇసుక తవ్వకాలు జరగడంతో అడుగుకో గుంత ఏర్పడింది. అది కూడా చిన్న పాటి గుంత కాదు. బావులను తలపించేలా తవ్వేశారు. గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలకు స్వర్ణముఖిలో వరదనీరు పారుతోంది. బావుల్లా ఏర్పడిన గోతుల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. చిన్నపాటి గుంతలైతే వరద తాకిడికి వచ్చే మట్టి, ఇసుకతో పూడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏర్పడిన భారీ గోతులు బావులను తలపిస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో పారే వరదనీటికి సమీప గ్రామాల నుంచి వచ్చి చేరే మురుగునీరుతో రంగు మారిపోవడంతో గోతుల లోతు కనిపించడం లేదు. చిన్నపాటి గుంతే కదాని కాలు పెట్టారో? మృత్యు గుంతలో అడుగుపెట్టినట్టే అవుతుంది. ప్రమాదకర గోతుల వద్ద హెచ్చరిక బోర్డులు పెడతామన్న అధికారుల మాటలు నీటిమూటలయ్యాయి.
వేదాంతపురం పంచాయతీ పరిధిలో గతనెల 24వ తేదీన ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృత్యుఒడికి చేరారు. ఆ సమయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇకపై నదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూస్తామని, ఎక్కడైనా ప్రమాదకర గోతులు ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెడతామని హడావుడి చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి, ఇసుక తవ్వకాలు జరగకుండా వరదనీరు పారుతున్నంత కాలం నదిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా కట్టడి చేస్తామని చెప్పారు. అయితే ఆ మాటలన్నీ నీటి మూటలయ్యాయని, ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నదిలో ఇసుక తవ్వేయడంతో నలుగురు యువకులు చనిపోతే కనీసం అక్కడ ఇసుక తవ్వకాలు జరిపిన వారిపై కేసు పెట్టడానికి కూడా పోలీసులకు మనసు రాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇసుక దిబ్బను అక్రమార్కులు గుట్టుగా అక్కడ నుంచి తరలించి అమ్మేసుకున్నా అడిగేవారు లేకపోయారని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకం
ఇసుకాసురులు ధనదాహంతో స్వార్థం అనే గునపంతో స్వర్ణముఖి గుండెల్లో గుచ్చుతున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తవ్వకం జరుపుతున్నారు. ఫలితంగా ఇసుక మేటలు మాయమై బావులను తలపించే గుంతలు ఏర్పడుతున్నాయి. అడుగడుగునా ఇలాంటి సుడిగుండాలు లెక్కలేనన్ని స్వర్ణముఖి మది నిండా ఉన్నాయి. ఆ గుంతల్లో వర్షాకాలం నీటితోపాటు బురద చేరుతోంది. ఆ విషయం తెలియని అభాగ్యులు సరదాగానో.. లేక స్నానానికో దిగి మృత్యువాత పడుతున్నారు. ఫలితంగా స్వర్ణముఖిలోని గుంతలతో పలు కుటుంబాల్లో చింతలు మిగులుతున్నాయి.
నాయుడుపేటటౌన్: తాగు, సాగునీటికి కల్పతరువుగా ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలతో పలు చోట్ల గుంతలు ఏర్పడి, ప్రమాద భరితంగా మారాయి. మండలంలోని భీమవరం, చిగురుపాడు, పట్టణ పరిధిలోని ఎల్‌ఏ సాగరం, తుమ్మూరు, మర్లపల్లి, అన్నమేడు, మడపలం కాలువ గట్టు, వేముగుంట పాళెం, మూర్తి రెడ్డి పాళెం, అయ్యప్పరెడ్డి పాళెం, కల్లిపేడు, కాపులూరు, కూచివాడ తదితర ప్రాంతల్లో స్వర్ణముఖి నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వివేయడంతో నదిలో గుంతలు ఏర్పడి భావులను తలపిస్తున్నాయి. పట్టణ పరిధిలోని ఎల్‌ఏ సాగరం బీడీ కాలనీ వద్ద స్వర్ణముఖి నదిలో గత నెల 7 తేదీన కూలి పనలు చేసుకునే నిరుపేద కుటంబానికి చెందిన కుదిరి ఉదయ్ కుమార్(35) అనే వ్యక్తి స్నానానికి నదిలో దిగి అక్కడి బురదలో కురుకుని పోయి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతునికి భార్య లక్ష్మి, లాస్య అనే కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఏకై క ఆధారంగా ఉన్న ఉదయ్ కుమార్ మృతితో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
● ఇసుక తవ్వేయడంతో భారీ గోతులు ● వరద పారుతున్నా యంత్రాలత
● ఇసుక తవ్వేయడంతో భారీ గోతులు ● వరద పారుతున్నా యంత్రాలత


