సెన్యార్ తుపాన్ హెచ్చరికలు
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన సెన్యార్ అనే తుపాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు చేశారు. గురువారం వరకు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మారి, చిరుజల్లులు కురవడం, చలిగాలులు వీయడంతో తుపా న్ ప్రభావం కనిపించింది. దీంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మండలస్థాయిలో మండల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ ప్రభావం తగ్గే వరకు ఎవరికీ సెలవులు మంజూరు చేయవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా మార్పు చెంది భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు సమాచారశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత వాతావరణ శాఖ జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిందని చెప్పారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి రానున్న 48 గంటల పాటు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా మని వెల్లడించారు. అన్నీ విభాగాలకు చెందిన అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్స్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.


