ఈతకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
చిట్టమూరు: మండలంలో స్వర్ణముఖి నదిలోకి సరదాగా ఈతకు వెళ్లిన వారు అక్కడ ఉన్న గుంతల్లో కూరుకుపోయి మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామం నుంచి చిట్టమూరు మండలంలో గునపాటిపాళెం, గునపాడు, మెట్టు గ్రామాల మీదుగా నదీ పరివాహక ప్రాంతం ఉంది. గూడలి గ్రామం నుంచి కోట మండలంలో స్వర్ణముఖి ప్రవహిస్తుంది. చిట్టమూరు మండలంలో సుమారు 7 కిలోమీటర్లు నదీ ప్రవాహం సాగుతోంది. అయితే నదిలో హిటాచీలు పెట్టి ఇసుక 50 నుంచి వంద అడుగులు లోతు తవ్వి వేయడంతో బురద తేలిపోయింది. వర్షాలు కురిసినప్పుడు, తెలుగుగంగ నీరు నదిలో ప్రవహిస్తున్న సమయంలో ఈ లోతైన గుంతల్లో ఇసుక చేరడంతో కంటికి కనపించదు. ఇది తెలియక ఈతకు వెళ్లిన వారు, పశువుల కాపరులు ఈ ఊబిలో కూరుకుపోయి చనిపోతున్నారు. అధికారులు కూడా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో గత సంవత్సరం నవంబర్ 4వ తేదీన మెట్టు జెడ్పీ హైస్కూలులో పదో తరగతి చదువుతున్న కోట మండలం విద్యానగర్ ప్రాంతానికి చెందిన వీరేంద్ర సాయి అనే విద్యార్థి మెట్టు గ్రామం వద్ద స్వర్ణముఖి నదిలో దిగి మృతి చెందాడు. అనధికారికంగా మరో ఇద్దరు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
కోట: మండలంలో రుద్రవరం నుంచి గూడలి వరకు రెండు కిలోమీటర్ల మేర స్వర్ణముఖి నది ప్రవాహం ఉంటుంది. గూడలితోపాటు రుద్రవరంలో ఇసుక కోసం యంత్రాలతో భారీగా తవ్వివేయడంతో గుంతలు ఏర్పడ్డాయి. గత ఏడాది అక్టోబర్‌లో రుద్రవరం గ్రామానికి చెందిన ఏడుకొండలు గేదెలు తోలుకుని వెళ్లి ఇసుక కోసం తీసిన గుంతలో పడి మృతి చెందాడు.
స్వర్ణముఖిలో ప్రమాదకరంగా గుంతలు
ఈతకు వెళ్లి మృత్యు ఒడిలోకి..


