కళత్తూరు పునరుద్ధరణకు రూ.కోటి
తిరుపతి అర్బన్ : కేవీబీపురం మండలంలోని రాయలచెరువుకు గండి పడిన ఘటనలో దెబ్బతిన్న కళత్తూరు, పాతపాళెం గ్రామాల పునరుద్ధరణకు ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.కోటి విడుదల చేస్తామని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో చైర్మన్ హోదాలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. దిశ సమావేశానికి గైర్హాజరైన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో రాయలచెరువు తరహా ఘటనలు జరగకుండా కరకట్టలను బలోపేతం చేయిచాలని కోరారు. కళత్తూరు, పాతపాళెం గ్రామాలకు ఉచితంగా వరి విత్తనాలు, గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలని సూచించారు. ఎస్సీకాలనీలు, వెనుకబడిన వర్గాలు నివసించే గ్రామాల అభివృద్ది కోసం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ద్వారా ఇచ్చే రూ.10 కోట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి (సీఎస్‌ఆర్) కింద సుమారు రూ.180 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఎక్కడో వెచ్చిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నిధుల్లో కనీసం 40 శాతమైనా జిల్లాలో ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తీర ప్రాంతాల్లో జలజీవన్‌మిషన్ ద్వారా చేపడుతున్న పనులు వేగవంతం చేయాలని చెప్పారు. సాగరమాల రహదారులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో సర్వీస్‌రోడ్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులకు చెందిన బిల్లుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దిశ సమావేశానికి హజరుకాని అధికారులపై చర్యలుంటాయని తెలిపారు. జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, నెల్లూరు జిల్లా సీఈఓ మోహన్‌కుమార్, ఎస్సీ వెల్పేర్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీపీఓ సుశీలాదేవి,డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, డీఈఓ కేవీఎన్ కుమార్, డీఏఓ ప్రసాద్‌రావు, సర్వే ఏడీ అరుణ్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి పాల్గొన్నారు.


