
ఆలయం కూల్చివేతకు యత్నం
చంద్రగిరి : సనాతన ధర్మం పరిరక్షణే లక్ష్యమని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వంలో రహదారి నిర్మాణం పేరిట ఆలయం కూల్చేందుకు యత్నించారు. ఆదివారం ఈ మేరకు స్థానికులు అడ్డుకున్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని నేతాజీ నగర్‌లో వినాయస్వామివారి ఆలయాన్ని కాలనీ వాసులే నిర్మించుకున్నారు. స్వామివారికి కై ంకర్యాలను నిర్వహించుకుంటున్నారు. మరో నాలుగు రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్న తరుణంలో ఆలయ అలంకరణకు సన్నద్ధమయ్యారు. సన్నాహాలు చేస్తున్నారు.
రహదారి పేరిట కుట్ర
తిరుచానూరు సమీపంలోని ఓరియన్ హోటల్ నుంచి పద్మావతిపురం వరకు సుమారు రూ.4కోట్ల టీటీడీ నిధులతో తుడా ఆధ్వర్యంలో రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే శిల్పారామం వెనుక చెరువు కట్టపై ఈ పనులు చేపట్టారు. అయితే రహదారి విస్తరణలో భాగంగా చెరువు పక్కన ఉన్న శ్రీవినాయక స్వామి ఆలయాన్ని కూల్చివేసేందుకు కొంతమంది అధికారులు, నేతలు యత్నించారు. దీంతో ఆదివారం స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. స్వార్థరాజకీయాల కోసం గుడిని కూల్చివేయాలని చూడడం దారుణమని మండిపడ్డారు. చెరువు స్థలం ఉన్నప్పటికీ, గుడిని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను ధ్వంసం చేయడం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించినా, కూటమి ప్రభుత్వంలో దాడులు మాత్రం ఆగడం లేదని వాపోతున్నారు. అయితే సోమవారం మరోసారి అధికారులు రోడ్డు నిర్మాణానికి సంబంధించి పరిశీలనకు రానున్నట్లు తెలిసింది.