
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
తొట్టంబేడు: శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తొట్టంబేడు మండలం మీదుగా వెళుతున్న స్వర్ణముఖి నదిలో భారీగా ఇసుక దందా సాగిస్తోంది. పెద్దపెద్ద ప్రొకై ్లన్ల సాయంతో టిప్పర్లు, ట్రాక్టర్లకు నింపి రాత్రి, పగలు తేడాలేకుండా తరలించేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని నదీ పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల ఎకరాల మేర బీడు భూములుగా మారే పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మండలంలోని విరూపాక్షపురం గ్రామ పరిసరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అధికారుల అండతో ఇసుకను తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.