సొంతింటి కల నెరవేర్చండి
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీ.హరినాథ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట, సీపీఐ నాయకులు, పేదలు, కార్మికులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 32లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పలు సభల్లో గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాల్లో 2సెంట్లు చొప్పున అర్హులకు స్థలాలు ఇవ్వాలని, అధికారంలోకి వస్తే ఆ విధంగా స్థలాలు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థతిపై అవగాహన ఉన్న చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. పింఛన్ తప్ప ఏ ఒక్క హమీనైనా కూటమి ప్రభుత్వం అమలు చేసిందా అని ప్రశ్నించారు. పోలవరం, అమరావతి చుట్టూ దృష్టి మరల్చి రాష్ట్ర ప్రజల స్థితిగతులను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతగూడు కోసం పేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు చొప్పున అందజేయాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివారెడ్డి, కార్యదర్శి విశ్వనాథ్, ఎన్‌డీ రవి, కేవై రాజ పద్మనాభరెడ్డి, రామక్రిష్ణ, బలరాం, రత్నమ్మ, శ్రీరాములు, శివ, విజయ, రామముర్తి, కాలయ్య, మునిశ్వర్, ప్రమీల, వెంకటేష్, బాషా తదితరలు పాల్గొన్నారు.


