హాకీ క్రీడాకారులకు ఎస్పీ అభినందనలు
– పోలీసులకు గుర్తింపు రివార్డు ప్రకటన
తిరుపతి క్రైమ్: జాతీయ స్థాయి పోలీస్ హాకీ పోటీల్లో ప్రతిభ చూపిన తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ సిటీలో నిర్వహించిన 74వ ఆల్ ఇండియా పోలీస్ హాకీ చాంపియన్‌షిప్ –2025–26 పోటీల్లో తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది టీఎస్ అమృత్ కుమార్ (పీసీ–873), ఈస్ట్ పోలీస్ స్టేషన్, అలాగే ఎం. వరముని (పీసీ–1037), బీఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, ప్రతిభ కనబరిచారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాష్ట్రానికి, జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. అనంతరం పోలీస్ శాఖలో క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో వారి సేవలకు గుర్తింపుగా రివార్డు ప్రకటించారు.
తిరుపతి ఖ్యాతిని చాటాలి
ఏర్పేడు: తిరుపతి ఐసర్ ఖ్యాతి చాటేలా క్రీడల్లో ప్రతిభ చూపాలని వారందరిని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య సూచించారు. భువనేశ్వర్ ఐసర్ వేదికగా ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న స్పోర్ట్స్ మీట్‌కు తిరుపతి ఐసర్ నుంచి 149 మంది విద్యార్థులు బయలుదేరి వెళ్లారు. తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, స్పోర్ట్స్ కమిటీ చైర్‌పర్సన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాస్ఫూర్తిని చాటేలా తోటి క్రీడాకారులతో ఎంతో క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమల క్యూకాంప్లెక్స్‌లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు సోమవారం వేచి ఉన్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
హాకీ క్రీడాకారులకు ఎస్పీ అభినందనలు


