ధనుర్మాసం.. పుణ్యమార్గం
ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం తిరుప్పావై పాశురాల పారాయణం ప్రాశస్త్యం ఏకాంతంగా అర్చన, తోమాల సేవలు
మాసానాం మార్గశిర్షోహం..మార్గశిరం తనకు ఇష్టమైనదని శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు. శ్రీమహావిష్ణువుకు ఈ మాసమంటే అంత్యంత ప్రీతి. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించే వరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసంగా పిలుస్తారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమై ఆయన్ని చేరుకోవడానికి మార్గం చూపించేదే ఈ మాసం. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కథనం.
తిరుమల: సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించే మహత్తర ఘట్టమే ధనుర్మాసం. ఈ హేమంత సమయాన అందరిలోనూ భక్తిభావం తొణికిసలాడుతుంది. ఈ నెలంతా వైష్ణవాలయాల్లో భక్తులు భక్తిభావంతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసం విశిష్టమైది. శ్రీవేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించేది ధనుర్మాసం. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ఈ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణాన్ని నివేదిస్తున్నారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై సేవ కొనసాగనుంది.
ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కై ంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష ప్రసాదాలను నివేదిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం ప్రాశస్త్యం
ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని సాన్నిథ్యం పొందాలని ఆకాంక్షించే సాధకులకు గోదాదేవి అనుభవ పూర్వకంగా రచించిన తిరుప్పావై లోకానికే దివ్య సందేశం. 12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ఏకాంతంగా తోమాల, అర్చన, అర్జిత సేవలు
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా జనవరి 14వ తేదీ వరకు తోమాల, అర్చన సేవలకు భక్తులను అనుమతించరు. ఈ సేవలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఆర్జిత సేవలు రద్దు
డిసెంబర్ 29 నుంచి జనవరి 1వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులను అనుమతించరు.


