అలంకారప్రాయంగా నిఘా నేత్రాలు
తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఆవరణంలోని శ్రీహరి బస్టాండ్‌లో 17 సీసీ కెమెరాలు, శ్రీనివాస బస్టాండ్‌లో 11 సీసీ కెమెరాలు, ఏడుకొండల బస్టాండ్‌లో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 33 సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో 50 శాతం మేరకు పనిచేయడం లేదని, పలు సీసీ కెమెరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ అధికారులు దాతల వద్దకు పది రోజులుగా తిరుగుతున్నట్లు సమాచారం. రెండేళ్ల కిందట కార్గో పార్శిల్ విభాగానికి కడప నుంచి రూ.2 లక్షల విలువ చేసే పట్టుచీరలు వచ్చాయి. వాటిని చోరీ చేశారు. వెంటనే సీసీ కెమెరాల ద్వారా పట్టుకున్నారు. ఎంతో కీలకమైన సీసీ కెమెరాలను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం నుంచి 30 కిలోల గంజాయిని తిరుపతి బస్టాండ్ నుంచి తమిళనాడుకు తరలించే క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి బస్టాండ్ ఆధారంగా గంజాయి వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని పోలీసులు కట్టడి చేయాల్సి ఉంది.


