
కేరళ తరహాలో టూరిజం అభివృద్ధి
తిరుపతి అర్బన్: కేరళ రాష్ట్రం తరహాలో తిరుపతి జిల్లాలో టూరిజం విభాగం అభివృద్ధి చెందేలా కృషి చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ, ఇన్‌చార్జి జోనల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి నగర కమిషనర్ నారపురెడ్డి మౌర్యతోపాటు పలు విభాగాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి నగరానికి నిత్యం టూరిస్టుల తాకిడి నెలకొంటోందని, ఈ నేపథ్యంలో ఆ రంగాన్ని మరింత అభివృద్ధి చే యాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో తిరుపతి జిల్లా 3వ స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. ట్రైన్‌నీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
గూడబాతుకు వడదెబ్బ
సూళ్లూరుపేట రూరల్: గూడ బాతు వడదెబ్బ బారినపడింది. ఎగురుకుంటూ వచ్చి సూళ్లూరుపేట మండలం, టోల్‌ప్లాజా సమీపంలోని ఓ ఇంటిపై సొమ్మసిల్లి పడిపోయింది. గుర్తించిన స్థానికులు సోమవారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. డీఎఫ్‌ఓ హారిక సిబ్బందితో అక్కడకు చేరుకుని గూడబాతును పరిశీలించారు. వెంటనే ఫెలికాన్ పక్షిని సూళ్లూరుపేటలో ఉన్న వెటర్నరీ వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. వడ దెబ్బతగిలిందని అధికారులు గుర్తించారు. చికిత్స అనంతరం గూడబాతును పులికాట్ సమీపంలోని కుదిరి చెరువులో వదిలిపెట్టారు. ప్రాణా పాయం లేదని పేర్కొన్నారు.
షార్‌లో భద్రతా సమావేశం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో మంగళవారం భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. భారత్–పాక్ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని షార్ కేంద్రానికి భద్రతను మరింత పటిష్టం చేశారు. తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. ఈ సమావేశంలో సీఐఎస్‌ఎప్ కమాండెంట్ సంజీవ్‌కుమార్, కోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, డీఎస్పీ చెంచుబాబు, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు పాల్గొన్నారు.

కేరళ తరహాలో టూరిజం అభివృద్ధి