కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
తిరుపతి అర్బన్ : పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదకరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్న ఫ్యాక్టరీల్లో కార్మికులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే నష్ట నివారణకు అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖలు సమష్టిగా కృషి చేయాలని వెల్లడించారు.డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, శ్రీ కాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
హైవే పనులు వేగవంతం
మల్లవరం–నాయుడుపేట మార్గంలో పెండింగ్‌లో ఉన్న హైవే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్చువల్‌గా చైన్నెకి చెందిన జాతీయ రహదారి పీడీ రవీంద్రరాపు హాజరయ్యారు. ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకటేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు.
వ్యవసాయ రంగంపై సమీక్ష
వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. భూసారం పెంచేందుకు కొత్తగా వచ్చిన 30రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 2025–26కు సంబంధించి జిల్లాలో 40వేల ఎకరాల్లో ఆ విత్తనాలను చల్లించాలని సూచించారు. అలాగే మత్స్యకారులకు రాయితీపై బోట్లు ఇప్పించాలని కోరారు. సముద్రంలో నాచు ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రొయ్యల చెరువుల అభివృద్ధికి ఉపాధి నిధులు వాడుకోవాలని కోరారు. ఉద్యానశాఖ అధికారులు వ్యాపార పంటలను ప్రోత్సహించాలని చెప్పారు.పశుసంవర్థక శాఖ అధికారులు పాడి రైతులకు పశుగ్రాసాలపై అవగాహన కల్పించాలని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, మత్స్యశాఖ అధికారి నాగరాజు, పశుసంవర్థకశాఖ అధికారి రవికుమార్, ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగం పాల్గొన్నారు.
టూరిజంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా కల్యాణి డ్యామ్, చంద్రగిరి కోటతోపాటు ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. టూరిజం అధికారులు రమణప్రసాద్, జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


