పురుగులొస్తున్నాయ్‌ లోకేషన్నా! | - | Sakshi
Sakshi News home page

పురుగులొస్తున్నాయ్‌ లోకేషన్నా!

Nov 20 2024 12:26 AM | Updated on Nov 20 2024 10:59 AM

-

మంత్రి లోకేష్‌కు మహిళా వర్సిటీ విద్యార్థుల లేఖాస్త్రం 

ట్విటర్‌, ఈమెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు సంధించిన వైనం 

తిరుపతి సిటీ: ‘రాష్ట్ర విద్యా, ఐటీ శాఖా మంత్రి వర్యులు నారా లోకేష్‌గారికి మేం ఒక్కటే విన్నవించ దల్చుకున్నాం. మేం తినే అన్నం, కూరలు చాలా నాసిరకంగా ఉన్నాయి. తరచూ పురుగులు వస్తున్నాయి. దయ చేసి నాణ్యమైన ఆహారం పెట్టే విధంగా చర్యలు చేపట్టండి’ అంటూ తిరుపతి మహిళా వర్సిటీ విద్యార్థులు సోషల్‌ మీడియా వేదికగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ట్విటర్‌, ఈమెయిల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేజ్‌ల ద్వారా వర్సిటీలోని వసతిగృహాల దయనీయ స్థితిని మంత్రికి నేరుగా ఫిర్యాదు చేశారు. గతంలోనూ హాస్టల్స్‌లో భోజన వసతులపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా విద్యార్థులే మంత్రికి ఫిర్యాదు చేశారు. నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు. అధికారులు, హాస్టల్‌ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.

పొంగలిలో పురుగు పడ్డా పట్టించుకోలేదు
మహిళా వర్సిటీలోని అంజీరా బ్లాక్‌ వసతి గృహంలో గత శనివారం ఉదయం వడ్డించిన పొంగలిలో పురుగులు పడ్డాయి. ఆదే విషయాన్ని హాస్టల్‌ సిబ్బందికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. తమ నోరు నొక్కి విషయాన్ని బయటకు పొక్కకుండా అణచివేశారు. ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ. 4వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయినా నాణ్యమైన ఆహారాన్ని పెట్టడం లేదు. విద్యార్థినులు చాలా మంది హాస్టల్‌ భోజనంపై విరక్తి చెంది క్యాంటీన్‌లో, బయట నుంచి ఫుడ్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు.
– విద్యార్థినులు, మహిళా వర్సిటీ

నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం
మహిళా వర్సిటీ హాస్టల్‌లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం. పొంగలిలో పురుగు వచ్చిందన్న విషయంపై మాకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. ఓ విద్యార్థిని రాష్ట్ర మంత్రికి మెసేజ్‌ ద్వారా ఫిర్యాదు పంపిందని వార్తలు రాగానే విచారణ చేపట్టాం. ఆహారంలో పురగులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణులు అవాస్తవమని తేలింది.
– ప్రొఫెసర్‌ వీ.ఉమ,ఇన్‌చార్జి వీసీ, మహిళావర్సిటీ

విచారకరం
మహిళా వర్సిటీలోని వసతిగృహాలలో మౌలిక వసతులు, నాణ్యమైన భోజనంపై ఏఐఎస్‌ఎఫ్‌, వైఎస్సార్‌సీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌ఓ వంటి ఐక్య విద్యార్థి సంఘాలు అధికారులను కలసి పలు మార్లు వినతి పత్రాలు అందించాం. కానీ తీరు మారకపోవడం విచారకరం. ఇప్పటికై నా విద్యార్థినుల వసతి గృహాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి నాణ్యమైన ఆహారం అందించాలి. లేకుంటే నిరసనలు, ధర్నాలతో కదం తొక్కుతాం.
–విద్యార్థి సంఘాల ఐక్య వేదిక, తిరుపతి

పురుగులొస్తున్నాయ్‌ లోకేషన్నా!1
1/1

పురుగులొస్తున్నాయ్‌ లోకేషన్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement