పోలీసుల అదుపులో ప్రేమజంట | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ప్రేమజంట

Aug 17 2024 1:18 AM | Updated on Aug 17 2024 10:27 AM

-

చంద్రగిరి(తిరుచానూరు): ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ప్రేమ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన అలేఖ్య(26), శివ(33) గత 11 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో గురువారం అన్నవరంలోని ఓ రామాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయిఏత అలేఖ్య అదృశ్యమైందంటూ ఆమె తల్లిదండ్రులు భవానీ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అలేఖ్య వివరాలను అన్ని పోలీసు స్టేషన్‌లకు అందించి అప్రమత్తం చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో వస్తున్న అలేఖ్య, శివ దంపతులను తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్థానిక పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడి నుంచి తిరుచానూరుకు బయల్దేరారు. ఇదిలా ఉండగా ప్రేమజంట అలేఖ్య, శివ ఓ వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

 తమకు ఇష్ట్రపకారమే ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఈ పెళ్లి అలేఖ్య తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో తమపై పగ పెంచుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను పోలీసులే రక్షించాలంటూ వారు ఆ వీడియోలో కోరారు. దీనిపై సీఐ సునీల్‌కుమార్‌ను వివరణ కోరగా... విజయవాడలో అలేఖ్య మిస్సింగ్‌ అయ్యినట్లు కేసు నమోదైందని, దీంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించామన్నారు. వారు ప్రేమజంటను తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement