
స్వర్ణముఖి నదీ తీరం వద్ద యువకుడి మృతదేహం
నాయుడుపేట టౌన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి నది వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, కడియనల్లూరు గ్రామానికి చెందిన కుమార్‌రాజేష్(31) ఓజిలి మండలం, పెదపరియ గ్రామ సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పరిశ్రమలో రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. పరిశ్రమ వద్దే నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం రాజేష్ అదే పరిశ్రమలో పనిచేస్తున్న తన స్నేహితులు శ్రీనివాస్, శశికుమార్‌తో కలిసి మండల పరిధిలోని మర్లపల్లి జాతీయ రహదారి కూడలి సమీపంలో స్వర్ణముఖి బ్రిడ్జి కింద నదిలో సరదగా ఈత కొట్టేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు నది వద్దే ఉన్నారు. శ్రీనివాసన్, శశికుమార్ ఇద్దరూ అక్కడి నుంచే వచ్చేశారు. రజేష్ మాత్రం ఈత కొడుతూ నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. సోమవారం రాత్రి నైట్‌డ్యూటీకి సైతం రాకపోవడంతో స్నేహితులు మంగళవారం ఉదయం స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి చూడగా రాజేష్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ గోపి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి రమేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆపై మృతుడి తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.