పెంచలకోన దేవస్థానానికి భారీ రాబడి

హుండీ కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది  - Sakshi

రాపూరు: పెంచలకోన దేవస్థానానికి ఒక కోటి, రెండులక్షల, ముఫ్ఫై రెండువేల మూడు వందల, ఎనభై రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈఓ జనార్దన్‌రెడ్డి, జిల్లా ఎండోమెంట్‌ అధికారి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. సోమవారం దేవస్థాన అలంకారమండపంలో హుండీ కానుకలను లెక్కించగా.. నగదు తోపాటు 360 గ్రాముల బంగారం, వెండి 4 కిలోల 800 గ్రాములు, యూఎస్‌ఏ డాలర్లు 89, కువైట్‌ దినార్లు 52, బహరిన్‌ దినార్‌ 1, మలెషియారింగిట్స్‌ 11, ఇంగ్లండ్‌ ఫైన్లు 25 వచ్చినట్లు వివరించారు. శ్రీవారి నిత్యాన్నదానంలోని హుండీలో రూ.3,85,908 వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం 86 రోజులకు చెందినదని వారు వెల్లడించారు.

నిబంధనల మేరకే పంచనామా

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో మూలవిరాట్‌ తొలగింపు సందర్భంగా నిబంధనల ప్రకారమే పంచనామా నిర్వహించామని ఈఓ సాగర్‌బాబు తెలిపారు. ఆలయ పరిపాలనా భవనంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆలయ మూలవిరాట్‌ తొలగింపులో విపక్షాలను పిలవలేదన్న అక్కసుతో అక్కడ లభించిన బంగారాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌లో అమ్ముకున్నారంటూ టీడీపీ నేత బొజ్జలసుధీర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. స్వామివారి మూలవిరాట్‌ తొలగింపు విషయాన్ని నాలుగు రోజుల ముందు ప్రకటించామని చెప్పారు. అందరి సమక్షంలో మూలవిరాట్‌ను నిబంధనలకు అనుగుణంగా తొలగించామన్నారు. సీసీకెమెరాల నిఘాలోనే పంచనామా నిర్వహించామన్నారు. బంగారు, వజ్రాలు దొరికాయంటూ టీడీపీ నేత చేసిన ఆరోపణలు అసత్యమన్నారు. ఇలాంటి ఆరోపణలపై దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అర్చకుడు మాట్లాడుతూ ఆలయ మూలవిరాట్‌ తొలగింపునకు పీఠాధిపతులు వంటి వారు రారని, అందరి సమక్షంలోనే పంచనామా నిర్వహించి మూలవిరాట్‌ను పానవట్టం నుంచి తొలగించామని తెలిపారు. అందులోని బంగారు, నవరత్నాలు, రాగిరేకులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచినట్టు వెల్లడించారు. అనంతరం వీఆర్వో బాలమురళి తాను చూసిన దాన్ని చూసినట్టు వివరించగా.. పాలకమండలి సభ్యులు జయశ్యామ్‌రాయల్‌ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే శ్రీకాళహస్తిలో తిరగనివ్వమని హెచ్చరించారు. సమావేశంలో మల్లికార్జున్‌, మురళీధర్‌రెడ్డి, లోకేష్‌, సతీష్‌మాలిక్‌ పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా ‘పది’ పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌/ తిరుపతి ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షలను ఎలాంటి తప్పులకు తావులేకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. సోమవారం ఈ మేరకు పరీక్షల నిర్వహణపై డీఈఓకు పలు సూచనలు చేశారు. దీనిపై డీఈఓ శేఖర్‌ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లు, నామినల్‌ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే సవరణకు అవకాశం కల్పించామన్నారు. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నష్టం వాటిల్లితే కఠిన చర్యలు తప్ప వని హెచ్చరించారు. అలాగే విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

● ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజువారీ సబ్జెక్టులను తెలుసుకునేందుకు టైమ్‌టేబుల్‌ను తప్పనిసరిగా చూసుకోవాలి.

● విద్యార్థులు ఉదయం 8:45 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

● హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉంచుకోకూడదు.

● పరీక్ష కేంద్రం నుంచి 12:45 గంటల లోపు ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకెళ్లకూడదు.

● ఓఎంఆర్‌ షీట్‌లో వివరాలను సరిచూసుకున్న తర్వాతే జవాబులు రాయాలి.

● పెన్ను, పెన్సిళ్లను వెంట తెచ్చుకోవాలి. ఆహారపదార్థాలు అనుమతించబడవు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top