
హైదరాబాద్: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. మంగళవారం సాయంత్రం బుట్ట కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, పలువురు న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దైవమే మానవ రూపేణ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు వక్తలు.. వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో తమకు ఉన్న అనుభవాలను సభికులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వై. ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి స్వాగతోపన్యాసం ఇచ్చారు. వేదికపైన ఉన్న పెద్దలకు, వైఎస్సార్ అభిమానులకు, వైఎస్సార్ ఆత్మీయులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది వైఎస్సార్ స్ఫూర్తి ఫౌండేషన్. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైఎస్సార్ అభిమానుల్ని ఒక వేదికపైకి తీసుకురావడమే. ఆయనలో లక్షణాలను ఒక్కసారి గుర్తు చేసుకుని, ఆయన ఆశయాల్ని ప్రజలందరి దగ్గరకు తీసుకెళ్లి, ఆయన పేరు చిరస్థాయిలో ప్రజల గుండెల్లో ఉండేటట్లు చేయాలనే సంకల్పంతో ప్రారంభించబడిన సంస్థ ఇది..
ఆయన చనిపోయి 16 ఏళ్లు అయినప్పటికీ, ఆయన్ని గుర్తుచేసుకుని ఇంత మంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే వైఎస్సార్ వ్యక్తిత్వమే కారణం. ఆయన మామూలు మనిషి కాదు.. దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహా మనిషి. ఎందుకు మహా మనిషంటే.. ఆయనతో దగ్గరగా పని చేసిన వాళ్లని కదిలిస్తే అది అర్థమవుతుంది. ఆయనతో నాకున్న ఒక అనుభవం పంచుకుంటాను.
పేదలకు నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చిన మహానేత
1989 నుంచి 2009 సెప్టెంబర్ వరకూ ఆయనతో అతి దగ్గరగా నడిచిన వ్యక్తిని నేను. రోజూ ఆయన్ను కలవడానికి వందలాది మంది వచ్చేవారు. అందులో సామాన్యులు, వీఐపీలు కూడా ఉండేవారు. వీఐపీలు రూమ్‌లో ఉంటే.. సామాన్యులు గ్యాలరీలో ఉండేవారు. కానీ ముందు ఆయన సామాన్యులను కలిసి వారి సమస్యలు వినేవారు. అలా ఎందుకు చేసేవారంటే.. సామాన్యులు ఇక్కడ వరకూ రావడమే కష్టం. మరి అటువంటుది వాళ్లను ముందుగా కలవకపోతే.. వారికి వసతి దగ్గర నుంచి టికెట్ల వరకూ అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యలతో వచ్చిన వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టకూడదనేవారు వైఎస్సార్. అలా సామాన్యుల సమస్యలు వినడమే కాదు.. అది తాను పడుకునే టైమ్‌కు ఎంతవరకూ వచ్చిందనేది రిపోర్ట్ ఇవ్వాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆదేశించేవారు వైఎస్సార్. అలా అందులోంచి పుట్టుకొచ్చినవే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, వృద్ధులకు పెన్షన్లు అనే పథకాలు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఏదో చేయాలనే తపన వైఎస్సార్‌లో ఎప్పుడూ ఉండేది. ఏ రైతూ ఆత్మహత్య చేసుకోకూడదు అనే భరోసా ఇచ్చిన వ్యక్తి వైఎస్సార్’ అని కొనియాడారు.
మాలాంటి వాళ్లను కూడా ఆయన అభిమానిగా మార్చుకున్నారు
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వైఎస్సార్‌తో ఆరంభంలో పెద్దగా పరిచయం లేదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అందుకు సపోర్ట్ చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇక్కడ విశేషమేటంటే మాలాంటి వాళ్లను కూడా వైఎస్సార్ ఆయనవైపుకు తిప్పుకునేలా చేశారు. ఒకానొక సందర్భంలో ఆయన క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత జర్నలిస్టులతో మాట్లాడారు. ఆ సమయంలో పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి చేస్తారా?, అని అడిగితే.. ‘ చేసి చూపిస్తాం’ అని ఒక ధృఢ సంకల్పంతో చెప్పిన మాట నన్ను ఆయనవైపుకు వెళ్లేలా చేసింది. ఆ రకంగానే పులిచెంతలను పూర్తి చేయడమే కాదు.. పోలవరానికి నిధులు తీసుకొచ్చి ఇంతవరకూ ఆ ప్రాజెక్టు రూపాంతరం చెందిందంటే అది వైఎస్సార్ ఘనతే’ అని కొనియాడారు.
వైఎస్సార్‌పై ఒక్కొక్కరి అనుభవంతో ఒక్కొక్క గ్రంథం రాయొచ్చు
వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరైన సభికులని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. సభలో ఉన్న ఒక్కొక్కరు వైఎస్సార్ గురించి చెబితే ఒక్కో గ్రంధం రాయొచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌తో ఉన్న తనకున్న అనుభవాన్ని దేవులపల్లి అమర్ పంచుకున్నారు. ‘నేను ఈ వృత్తిలోకి వచ్చి 50 ఏళ్లు అయ్యింది. 1976లో ఈ వృత్తిలో అడుగుపెట్టా. 1978లో వైఎస్సార్ శాసనసభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. అప్పట్లో బాగా దగ్గరగా లేకపోయినా, 1999లో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినదగ్గర్నుంచి నాకు అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. వైఎస్సార్ దగ్గర్నుంచీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఒక్కటి ఉంది. అది ‘హ్యూమన్ ఫేస్’. మానవత్వం అనేది ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం.
ఈరోజుల్లో రాజకీయ నాయకుల్లో బాగా లుప్తమైపోయినది కూడా అదే. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఉండాల్సిన మానవత్వం అనేది వైఎస్సార్ నుంచి రోజూ చూసేవాళ్లం. ఆయనకు మానవ్వతం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఒక అనుభవం చెబుతాను. ఒక కార్మికుడ్ని, ప్రింటింగ్ పేపర్‌లో వేస్ట్(రద్దు)ను వేరుకునే ఒక కార్మికుడ్ని ఒక సందర్భంలో వైఎస్సార్‌కు దగ్గరకు తీసుకుపోయా. ఆ కార్మికుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఆ కార్మికుడి రిపోర్ట్‌లు చూసి వైఎస్సార్ రూ. 2 లక్షల మంజూరు చేశారు. రూ. 30 వేలు అడిగిన సందర్భంలో అది ఎక్కడ సరిపోద్ది అని రెండు లక్షలు మంజూరు చేశారు.

దాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. అయితే ఆ మరుసటి రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో డబ్బులు విషయంలో జాప్యం జరిగింది. అయితే ఆ కార్మికుడు ఆపై రెండు రోజులకు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్.. ఆ కుటుంబం ఊహించనంత పరిహారం ఇచ్చారు. ఆ కార్మికుడు ఎవరో వైఎస్సార్‌కు తెలీదు. అయినా మానవత్వంతో ఉదారత చాటుకున్నారు’ అని వైఎస్సార్‌తో తనకున్న ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఇలా అక్కడకు విచ్చేసిన పలువురు.. వైఎస్సార్‌తో ఉన్న ఆనాటి మరుపురాని అనుభవాలను పంచుకున్నారు. అవి ఈ వీడియోలో చూసేయండి.