మోటార్‌ స్పోర్ట్స్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం.. మొట్టమొదటిసారి కార్‌ రేసింగ్‌

Year End 2022 Hyderabad Hosted Car Racing Events First Time - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరం ఈ ఏడాది మొట్టమొదటిసారి మోటారు క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో రెండు దఫాలుగా జరిగిన ఈ రేసింగ్‌లు మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  
నవంబర్‌ 19, 20 తేదీల్లో సాంకేతిక కారణాల దృష్ట్యా పోటీలను నిర్వహించలేకపోయినా రెండు రోజుల ట్రయల్స్‌ హైదరాబాద్‌ నగరానికి ఒక కొత్త  క్రీడను పరిచయం చేశాయి. 
వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ ఎలక్ట్రిక్‌ వాహనాల రేసింగ్‌ పోటీలు ఫార్ములా–ఈ కి సన్నాహకంగా భావించే ఇండియన్‌ రేసింగ్‌ కార్‌కు నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల స్ట్రీట్‌ సర్క్యూట్‌ వేదికైంది. 
ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీల కోసం సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఈ ట్రాక్‌ను నిర్మించింది. ఇదే ట్రాక్‌పై నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఇండియన్‌ రేసింగ్‌ కారు పోటీలను నిర్వహించారు.  

హోరెత్తిన పోరు... 
హుస్సేన్‌సాగర్‌ తీరంలో రయ్‌మంటూ భారీ శబ్దంతో దూసుకెళ్లిన కార్లు నగరవాసులకు కొత్త పరిచయం. నవంబర్‌లో ఒక కారు ప్రమాదానికి గురికావడం, తరచు బ్రేక్‌డౌన్స్‌ చోటుచేసుకోవడం, రేసర్లు సన్నద్ధంగా లేకపోవడంతో ఈ నెలలో పోటీలను నిర్వహించలేదు. 
హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్‌తో పాటు చెన్నై, బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ప్యారిస్, ఇటలీ తదితర నగరాలకు చెందిన 12 బృందాలు, 22 మంది రేసర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.  
వాహనాల నిర్వహణ కోసం మెకానిక్‌లు, సాంకేతిక నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన బృందాలతో నెక్లెస్‌ రోడ్డు కోలాహలంగా మారింది. 
డిసెంబర్‌లో రెండవ దఫా నిర్వహించిన పోటీల్లో కొచ్చి టీమ్‌ విజేతగా గెలిచింది. హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రన్నరప్‌గా నిలిచింది.  
యువతను ముఖ్యంగా మోటార్‌ స్పోర్ట్స్‌  అభిమానులను అలరించిన ఈ పోటీలతో హైదరాబాద్‌ నగరం ఈ రంగలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.  
ఈ పోటీల వల్ల నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ రద్దీ నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరానికి వెలుపల పోటీలను నిర్వహించాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. 
ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలతో అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top